'పరిహారం పెంచినా రైతుల ఆత్మహత్యలు ఆగవు' | farmer suicides are continue if exgratia increase, says highcourt | Sakshi
Sakshi News home page

'పరిహారం పెంచినా రైతుల ఆత్మహత్యలు ఆగవు'

Published Tue, Sep 29 2015 9:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

'పరిహారం పెంచినా రైతుల ఆత్మహత్యలు ఆగవు' - Sakshi

'పరిహారం పెంచినా రైతుల ఆత్మహత్యలు ఆగవు'

రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారం పెంచినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, మూలాల్లోకి వెళ్లి కారణాలను ఆన్వేషించి పరిష్కారాలను కనుగొన్నప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడింది.  రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటోందని వ్యాఖ్యానించింది.

రైతుల కోసం పథకాలు ప్రవేశపెడితే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో వారికి చేరుతున్నాయో లేదో చూడాలంది. రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రాథమిక నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం లేదంటూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్యయాదవ్ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వివరించారు. దీనిపై ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (స్పెషల్ జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ పలు పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement