⇒ తనకు కౌలు చెక్కు ఇవ్వలేదని ఆరోపణ
తుళ్లూరు రూరల్(గుంటూరు జిల్లా): వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ ప్రహరీ నిర్మాణాన్ని స్థానిక రైతు అడ్డుకున్నాడు. తన భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించకుండా ఎలా నిర్మాణం చేపడతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ కొంత సమయం కార్మికులు, ఇంజినీర్లు, రైతుల మధ్య కొంత సమయం వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతు ఎంతకీ అక్కడినుంచి వెళ్లకపోవటంతో ప్రహరీ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
వెలగపూడి రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 214లో తనకు 1.17 ఎకరాల భూమి ఉందని రైతు వీరా ప్రసాద్ వెల్లడించాడు. అయితే ఈ భూమిని ల్యాండ్‌పూలింగ్ లో భాగంగా ఇచ్చేశానని, అయితే కౌలు చెక్కు ఇవ్వకుండా తన పొలంలో ప్రహరీ ఎలా నిర్మిస్తారని ఈ సందర్భంగా రైతు ప్రశ్నించాడు. తన భూమికి సంబంధించిన చెక్కుల సమస్యను పరిష్కరించే వరకు ప్రహరీ నిర్మాణం జరగటానికి వీల్లేదని డిమాండ్ చేశాడు. దీంతో మొదటి బ్లాక్ వెనుక వైపు నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణం మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
సచివాలయ ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతు
Published Wed, Sep 28 2016 10:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement