విద్యుత్ మోటార్లు కాలిపోతున్నా.. పట్టించుకోరా ?
కేసముద్రం : ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీకి మించి విద్యుత్ మోటార్లు ఉండటం వల్ల తరచూ తమ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు రాస్తారోకో నిర్వహించిన సంఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అందించే ట్రాన్స్‌ఫార్మర్ 100కేవీ (ఎస్‌ఎస్7) కింద 30 విద్యుత్ మోటార్లకు గాను 50కి పైగా ఉన్నాయన్నారు. దీనివల్ల లోఓల్టేజీ ఏర్పడి ఇప్పటికే పలుమార్లు మోటార్లు కాలిపోయాయని వాపోయారు. పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరారు. కార్యక్రమంలో రైతులు సంజీవరెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వీరభద్రం, వాసు తదితరులు పాల్గొన్నారు.