తప్పులు... తిప్పలు
- గందరగోళంగా మారిన పంట నష్ట పరిహారం పంపిణీ
- ఒకే రైతు ఖాతాలోనే ఇద్దరు, ముగ్గురి రైతుల పరిహారం జమ
- రూ. 30 వేలు దాటిన ఖాతాలను బ్లాక్ చేసిన అధికారులు
నంబులపూలకుంట: పంట నష్టపోయిన రైతులకు విడుదలైన పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. జాబితాను తయారు చేసే సమయంలో అధికారులు చేసిన పొరపాట్లు రైతులకు గ్రహపాటుగా మారాయి. గ్రామసభలో చదివి వినిపించిన జాబితాలో పేరున్నా పరిహారం ఇచ్చే సరికి రైతులకు అందాల్సిన పరిహారం మరొక రైతు జాబితాలో జమ కావడంతో ఇబ్బందులొస్తున్నాయి. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు మండలంలో సుమారు 300 మంది రైతులకు జమకావాల్సిన పరిహారం మొత్తం మరొకరి రైతు ఖాతాలో జమకావడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 8,840 మంది రైతుల ఖాతాలకు గాను రూ,12.16కోట్లు మంజూరైంది. వీరిలో 2,300 మంది రైతులకు బ్యాంకు ఖాతాలు సక్రమంగా నమోదు చేయకపోవడంతో జాబితాలో పేరున్నప్పటికీ పరిహారం రాని రైతులు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒకరి పరిహారాన్ని మరో రైతుకు జమ చేసిన వైనం
మండలంలో పి.కొత్తపల్లి, వంకమద్ది, మర్రికొమ్మదిన్నె రెవెన్యూ గ్రామాలల్లో ఒకరికి అందాల్సిన పరిహారం మరొకరి ఖాతాల్లో జమ అయింది. అయితే ఆ డబ్బులను కూడా సదరు రైతులు వాడుకోవడంతో ఇప్పుడు సమస్య వచ్చిపడింది. చాలా మంది రైతుల ఖాతాల నమోదులో తప్పులు జరిగినాయనే విషయాన్ని తెలుసుకొన్న వ్యవసాయాధికారులు బ్యాంకుకు వెళ్లి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.30,000లు దాటిన రైతుల ఖాతాలను హోల్డ్‌లో ఉంచాలంటూ కోరారు. వారు ఆదేశించే సమయానికి సుమారు 100 మంది రైతులకు పైగా తమ ఖాతాలల్లో జమ అయిన మెత్తాన్ని అవసరాల కోసం విత్‌డ్రా చేసేశారు.
నా పరిహారం వేరొకరికి అందింది
- బయ్యారెడ్డి, రైతు, పి.కొత్తపల్లి
నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చాను. అయితే అధికారులు మాత్రం మరొకరి స్టేట్ బ్యాంకు ఖాతా నెంబర్ నమోదు చేయడంతో నాకు రావాల్సిన పరిహారం ఆ రైతుకు జమ అయింది. ఆ రైతు పరిహారాన్ని కూడా విత్ డ్రా చేశాడు. డ్రా చేసుకొన్న రైతు పేరు కూడా తెలుసు. అధికారులను అడిగితే రైతు నుంచి రికవరీ చేసి ఇస్తాం అంటున్నారు. ఇది ఎప్పటికి జరుగుతుందో..?
తప్పులను సరిచేస్తాం
- రామ్ సురేష్‌బాబు, వ్యవసాయాధికారి
మిస్ మ్యాచింగ్ జాబితాతో పాటు రైతుల ఖాతాల మార్పు అయిన జాబాతాలను తయారు చేశాం. మరో రెండు రోజుల్లో అప్రూవల్ చేసి జేడీకి పంపడం జరుగుతుంది. హోల్డ్‌లో పెట్టిన రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వ సొమ్మును తొలగించి ఎవరికైతే చేరాలో వారి ఖాతాలల్లో జమచేస్తాం. ఇప్పటికే విత్ డ్రా చేసిన రైతుల నుంచి వారికి వచ్చిన పరిహారం పోను మిగిలిన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసి రికవరీ చేస్తాం.