- దేశాయిపేటలో పనులజాతర
- రోజూ 200మంది హాజరు
రైతుల ఉపాధిబాట
Published Wed, Jul 20 2016 10:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
మేడిపెల్లి : కాలం కలిసిరావడంలేదు. వేసిన పంటలు పండే పరిస్థితి కనిపించడంలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీపనులు చేయనిదే పొట్టనిండే పరిస్థితి కనించడంలేదు. అందుకే.. మోతుబరి నుంచి చిన్నరైతు సైతం ఉపాధిహామీలో చేరుతున్నారు. పలుగు, పార పట్టుకుని వందరోజుల పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరువు తీవ్రతకు అద్దంపడుతోంది దేశాయిపేట పల్లెదుస్థితి. దీనిపై కథనం..
మేడిపెల్లి మండలంలో 11,352 జాబ్‌కార్డులు ఉన్నాయి. సుమారు 20వేల కూలీలు తమ పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. దేశాయిపేటలో 450 జాబ్‌కార్డులు, 950 మంది కూలీలు పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఇందులో సగం మంది రైతులు కూలీలుగా తమ పేర్లను నమోదు చేసుకోవడం గమనార్హం. ఖరీఫ్ ప్రారంభమైనా నేటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో అన్నదాతలు హరితాహారం పథకంలో భాగంగా మెుక్కలకు గుంతలు తవ్వేందుకు వెళ్తున్నారు. గ్రామసమీపంలోని గుట్ట చుట్టూ మెుక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు గ్రామానికి చెందిన దాదాపు 200మంది రైతులు, కూలీలు ఈపనుల్లో నిమగ్నమయ్యారు. ఈసందర్భంగా రైతులు, కూలీలను పలుకరించగా.. తాము ఈ పనులకు ఎందుకు వస్తున్నామనే విషయంపై వివరించారు. వారి మాటల్లోనే..
పనిజేత్తేనే కడుపునిండేది – బొల్లె నరేష్, కూలీ
నేను క్రమం తప్పకుండా వందరోజుల పనికి వోతున్న. ఈ పనులు జేత్తేనే మాకుటుంబం కడుపునిండేది. ఈసారి ఇంకా వానలు పడలే. ఎవుసం పనులు మెుదలవలే. పొట్టకూటికోసం రైతులు గూడ మాతోపాటే వందరోజుల పనికస్తున్నరు.
అప్పుడు అడ్డుకున్నం – కుంట తిరుపతిరెడ్డి, రైతు
నాకు ఇరవై ఎకరాలుంది. వానలు పడితేనే బావులు, బోర్లలో నీళ్లచి పంటలు పండేది. ఇప్పటికీ వానలు లేవు. ఎవుసం పనులు సాగుతలేవు. పొట్టకూటికోసం ఉపాధిపనికి పోతున్నం. అప్పట్లో కూలీలను అడ్డుకున్నం. ఇప్పుడే మేమే పోతున్నం.
కాలం కలిసిరాలే – క్యాతం నారాయణరెడ్డి, రైతు
నేను కూలీలను తీస్కపోయి నా పొలంలో పనులు జేయించేటోన్ని. కాలం కలిసిరాలే. నమ్మకున్న నేలతల్లి సహకరించడంలేదు. భూములు బీళ్లుబారినయి. ఏం చేయాలో తోచడంలేదు. ఖాళీగా ఉంటే బతుకులేదు. అందుకే ఉపాధి పనికి వోతున్నం.
పెట్టుబడికి భయమేస్తంది – క్యాతం అనసూయ, రైతు
వానలు లేవు. బోర్లు, బావుల్లో నీళ్లురాలేదు. వరి నారు పోద్దామంటే వానలు పడకుంటే ఎండుతదని భయమేస్తంది. పెట్టుబడి మట్టిపాలైతే.. తేరుకునుడు కట్టం. అందుకే ఇప్పుడు పంటలపై ఆశలు వదులుకున్న. దొరికినకాడికి కూలీకి పోతున్న.
కూలీల సంఖ్య పెరిగింది – నాగరాజు, ఫీల్డ్‌అసిస్టెంట్
దేశాయిపేటలో నాలుగువందలకు పైగా జాబ్‌కార్డులున్నయ్. ఎనమబై మంది కూలీలు ఏడాదిపాటు ఉపాధి పనులకు వచ్చేవారు. రెండేళ్ళుగా వర్షాలు పడుతలేదు. ఎవుసం పనులు బందైనయి. రైతులూ ఇటే వస్తున్నరు. రోజూ రెండు వందల మంది పనిలో ఉంటున్నరు.
Advertisement
Advertisement