శాంతినగర్‌లో రాస్తారోకో చేస్తున్న ఉల్లిరైతులు
ఉల్లి రైతుల రాస్తారోకో
Published Tue, Aug 9 2016 1:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
రూ. 2వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్
శాంతినగర్ : వడ్డేపల్లి మండల పరిధిలోని తుమ్మిళ్ల, పెద్దతాండ్రపాడు, ముండ్లదిన్నె, కొంకల, తనగల, పచ్చర్ల, మాన్‌దొడ్డి, జూలెకల్ గ్రామాల రైతులు వేల ఎకరాల్లో ఉల్లిపంట సాగుచేశారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. కొందరు ఇప్పటికే ఉల్లిపంట తీసి ధరలేక చేల్లోనే వదిలేశారు. పంట సాగుకోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆగ్రహించిన రైతులు సోమవారం శాంతినగర్‌కు చేరుకున్నారు. అలంపూర్–రాయచూర్ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. గతేడాది ధరలు పెరిగాయని ఆలోచించిన ప్రభుత్వం ప్రజలకు ఆహారభద్రత కార్డుద్వారా తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించారని, ఈ ఏడాది ధరలు రూ. 300 లకు పడిపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉల్లి కనీస మద్దతు ధర రూ.2వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడంలేదని పెద్దతాండ్రపాడు ఎంపీటీసీ గోపాల్, రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న డీటీ నరేష్ రైతులతో మాట్లాడారు. విషయాన్ని కలెక్టర్, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపి సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం స్పందించలేదంటే జిల్లా కేంద్రంలో ఆందోళన చేపడతామని రెతులు హెచ్చరించారు.
Advertisement