జాతీయ రహదారిపై ఉద్రిక్తత
జాతీయ రహదారిపై ఉద్రిక్తత
Published Mon, Oct 3 2016 11:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– పరిహారం కోసం రైతుల ఆందోళన
– 5 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
– సీపీఐ, ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్
డోన్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన కరువు ప్రాంత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిని డోన్ సమీపంలో ఓబులాపురం మెట్ట వద్ద సోమవారం ఉదయం ఏపీ రైతు సంఘం, సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సభ్యులు ఎడ్లబండ్లతో దిగ్బంధించారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో ఓబులాపురం, యాపదిన్నె, దేవరబండ, రేకులకుంట, కొత్తపల్లె, ఉంగరానిగుండ్ల తదితర గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు గౌడ్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పడంతో సీఐ డోన్, వెల్దుర్తి, కష్ణగిరి నుంచి పోలీసులను రప్పించారు. అప్పటికే దాదాపు 5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐలు రామసుబ్బయ్య, సోమ్లనాయక్, పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సీపీఐ నాయకులు రామాంజనేయలు, రంగనాయుడు, లక్ష్మీనారాయణ, శివ, నారాయణ, కష్ణమూర్తి, రాముడు, సుధాకర్, నక్కిశ్రీకాంత్, రంగన్న తదితరులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
చంద్రబాబు రైతు ద్రోహి:
రైతు సంక్షేమాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని సీపీఐ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు విమర్శించారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న సీఎంకు రైతులు గుణపాఠం చెబుతారన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబును చిత్తుగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. నియంతలా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోతే భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Advertisement
Advertisement