కనురెప్పలు కాటేశాయ్
♦ ముగ్గురు బాలికలకు విషమిచ్చి బావిలో తోసిన తండ్రి
♦ ఇద్దరు మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరో బాలిక
♦ నాయుడుపేటలో చంటిబిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
తండ్రే కాలయముడై..
కనురెప్పలే కంటిని కాటేశాయి. భార్య వదిలి వెళ్లిపోయిందన్న అక్కసుతో ముగ్గురు కుమార్తెలకు విషం తాగించి బావిలో తోసేశాడు ఓ తండ్రి. వారిలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా.. మరో బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఏం కష్టవచ్చిందో తెలీదుగానీ కడుపు తీపిని చంపుకున్న ఓ తల్లి ఏడాది బిడ్డతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తూమ్మురు గ్రామ సమీపంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది.
కామిరెడ్డిపాడు (సోమశిల) :
పేదరికంలో పుట్టినా వారిది అందమైన జీవితం. ముత్యాల్లాంటి ముగ్గురు ఆడ పిల్లలు ఆ ఇంట్లో సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తెగమురిసిపోయారు. అంతలోనే సంతో షం ఆవిరైంది. కుటుంబానికి ఆర్థిక ఉన్నతి కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం అప్పు చేసి మరీ ఆ ఇంటాయన కువైట్ వెళ్లాడు. ఇదే అదునుగా మరో వ్యక్తితో చనువు పెంచుకున్న ఆ ఇంటావిడ 20 రోజుల క్రితం బిడ్డల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ఆమె భర్త రెండురోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. మనసులో రగిలిన సంఘర్షణ అతణ్ణి స్థిమితంగా ఉండనివ్వలేదు. మానవ మృగంలా మారి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చాడు. అక్కడితో ఆగకుండా వారిలో ఇద్దర్ని నూతిలోకి విసిరేశాడు. మూడో బిడ్డనూ విసిరేయబోతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే విష ప్రభావానికి గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో హరిత(8), కీర్తి(6) అనే చిన్నారులు మరణించగా.. ప్రేమ (4) ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
బతుకుదెరువు కోసం కువైట్‌కు..
గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన నల్లు పెంచలరత్నంకు వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి ఎగువమిట్టకు చెందిన భానుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. పెంచలరత్నం జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం అప్పు చేసి కువైట్ వెళ్లి గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. ఈ క్రమంలో అతని భార్య భాను గ్రామంలోని సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుని 20 రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అనంతసాగరం పోలీసులకు ఫిర్యాదు సైతం అందింది. విషయం తెలుసుకున్న పెంచలరత్నం రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్నాడు.
ముగ్గురు బిడ్డల్ని గ్రామానికి సమీపంలోని పొలాల్లో గల దిగుడు బావి వద్దకు తీసుకెళ్లాడు. ముగ్గురికీ పురుగు మందు తాగించి హరిత, కీర్తిలను బావిలోకి తోసేశాడు. కాలనీ వాసులు గమనించి మూడో కుమార్తె ప్రేమను బావిలో పడేయనివ్వకుండా అడ్డుకున్నారు. బాలికను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. పెంచలరత్నంను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ కేఎస్‌వీ సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సోమశిల ఎస్సై శివరాకేష్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆత్మకూరు తరలించారు.
గ్రామంలో విషాదం
ఇద్దరు పసికందులు తండ్రి ఘాతుకానికి బలైపోయారన్న విషయం తెలిసి ఘటనా స్థలానికి గ్రామస్తులు తండోతండలుగా తరలివచ్చారు. బిడ్డల్ని చంపేందుకు చేతులెట్టాడాయిరా అంటూ వాపోయారు. అందరితో కలివిడిగా తిరిగే చిన్నారులు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదం చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధమే కొంప తీసింది
పెంచలరత్నం కువైట్ వెళ్లడంతో అతని భార్య సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తితో కలిసి తరచూ భర్త పెంచలరత్నంకు సెల్‌ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసిన భర్త ఫోన్‌లో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో 20 రోజుల క్రితం ఆమె ఆ వ్యక్తితో కలిసి పరారైంది. విషయం తెలిసి స్వగ్రామానికి చేరుకున్న పెంచలరత్నం భార్యపై కోపాన్ని బిడ్డలపై చూపాడు. ఆమెకు పుట్టిన బిడ్డలు తనకొద్దంటూ ఘాతుకానికి పాల్పడ్డాడు.