
బాంబుపేలి గిరిజనులకు గాయాలు
♦ కూంబింగ్ పార్టీలు.. పోలీసులే లక్ష్యమా?
♦ భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు
వెంకటాపురం: ఏజెన్సీలో బాంబు పేలింది. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పక్కన బుధవారం ప్రెషర్‌బాంబు పేలి ఇద్దరు గిరిజనులకు గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామానికి చెందిన తెల్లం రమేష్, తెల్లం సురేష్, పోడియం రాధ రెండు రోజుల క్రితం చర్ల మండలం క్రాంతిపురంలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై కాంతిపురం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే రహదారి పక్కన మూత్రం పోసుకునేందుకు ద్విచక్రవాహనాన్ని ఆపారు. మూత్రం పోసుకునేందుకు వెళ్తూ రోడ్డుపక్కన మట్టిలో ఉన్న కర్రను పీకారు. ఒక్కసారిగా బాంబు పేలి తెల్లం రమేష్ తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పక్కనే ఉన్న పోడియం రాధకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఎదిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.
టార్గెట్ ఎవరు?
కూంబింగ్ పార్టీలు, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు రోడ్డు పక్కన బాంబులను ఏర్పాటు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బలగాలు ఈ రహదారుల మీదుగానే కూంబింగ్ వెళ్తుంటారు. వారిని మట్టుబెట్టేందుకే రహదారికి ఇరువైపులా బాంబులు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. బాంబుపేలిన ప్రాంతంలోనే ఇటీవల మావోయిస్టులు వాల్‌పోస్టర్లు సైతం వేశారు.
ఏజెన్సీలో భయం..భయం
చాలా కాలం తర్వాత మావోలు పోస్టర్లు వేయడం, బాంబులు పేలడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మావోలు, పోలీసుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.