హిందూపురానికి జ్వరమొచ్చింది
– విజృంభిస్తున్న డెంగీ, మలేరియా
– మృత్యువాత పడుతున్న రోగులు
హిందూపురం టౌన్ : పట్టణంలోని జ్వరాలతో బెంబేలెత్తిపోతున్నారు. సీజనల్ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో పట్టణవాసులు ఆస్పత్రి పాల్పవుతున్నారు. జ్వరాల బారిన పడుతున్న వారిలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. వర్షకాలం కావడంతో పట్టణ, మండల ప్రాంతాల్లో అపరిశుభ్రత సమస్యతో ప్రజలు రోగాలకు గురవుతున్నారు. దీనికి తోడు దోమకాటుతో మలేరియా జ్వరం వేగంగా సోకుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మలేరియాకు తోడు డెంగీ జ్వరాలు కూడా విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
హిందూపురం మండలంలోని మణేసముద్రానికి చెందిన నరసింహులు (27) డెంగీ లక్షణాలతో గత నెల 28న మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంలో బాధపడుతూ చికిత్స పొందుతుండేవాడు. పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే నరసింహులు మరణించాడు.
ఒకే మంచంపై ఇద్దరు లేదా ముగ్గురు
ఆస్పత్రికి జ్వరాలతో వచ్చే రోగుల తాకిడి పెరగడం, మంచాల సంఖ్య తక్కువ ఉండడంతో ఒకే మంచంపైనే ఇద్దరు లేదా ముగ్గురు రోగులను ఉంచాల్సి వస్తోంది. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు జ్వరాల బాధతో చేరే వారి సంఖ్య సుమారు 40 నుంచి 50 వరకు ఉంటోంది. దీంతో ఒకే మంచంపై ఇద్దరిద్దరిని ఉంచడంతో మరిన్ని జబ్బులు సోకే ప్రమాదం ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి జ్వరం సోకినా అందరికీ వచ్చిన ట్టే. ఫలితంగా పట్టణ ప్రజలు జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.