పోలీస్ పంజా
పోలీస్ పంజా
Published Tue, Mar 7 2017 11:05 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో నిర్బంధాల పర్వం
భయంతో పొలాల గట్ల వెంట పరారైన ప్రజలు
చంటి బిడ్డలతో బిక్కుబిక్కుమంటున్న మహిళలు
పోరాట కమిటీ నాయకుల అరెస్ట్
భీమవరం/భీమవరం అర్బన్ :
తుందుర్రు పరిసర గ్రామాలపై పోలీసులు పంజా విసిరారు. సామాన్య జనంపై మరోసారి దమనకాండ మొదలైంది. పోలీసులు ఇంటింటికీ వెళ్లడం.. స్నానాల గదుల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేయడం.. మహిళలను బెదిరించడం.. చిన్న పిల్లలను భయపెట్టడం వంటి వికృత చేష్టలకు దిగటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఒక్కరినీ వీడియో తీయడం, ఎలాంటి ఆందోళన జరిగినా మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరిస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. తుందుర్రు వద్ద నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలనే డిమాండ్‌తో భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 30 గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తూ నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. దీంతో పనులను ఈనెల 8వ తేదీలోగా నిలుపుదల చేయాలని.. లేనిపక్షంలో తామే అడ్డుకుంటామని ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ప్రకటించాయి. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ముకాస్తూ సామాన్యులపై మరోసారి దమనకాండకు దిగుతోంది. తుందుర్రు పరిసర గ్రామాల్లో సోమవారం రాత్రి నుంచే వేలాది మంది పోలీసులు మోహరించాయి. మంగళవారం ఉదయం నుంచీ పౌర హక్కులను కాలరాస్తూ నిర్బంధకాండను మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. మహిళలను, చిన్న పిల్లలను సైతం ఇళ్లల్లోంచి బయటకు రానివ్వడం లేదు. కంసాలి బేతపూడి, తుందుర్రు, జొన్నల గరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్క్ చుట్టుపక్కల వెయ్యి మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా కొంతమంది పొలాలు గట్ల మధ్య దాక్కొంటుంటే.. మరికొందరు పొలాల్లోంచి పారిపోతున్నారు.
ఉద్యమకారుల అరెస్ట్
తుందుర్రు గ్రామంలో మోదారమ్మ గుడివద్ద ఉన్న పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు, కొట్టు ప్రసాద్‌ను పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేశారు. శేరేపాలెంకు చెందిన కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపల్లి రాయుడు, ముత్యాలపల్లికి చెందిన నాగిడి రాంబాబు, బి.శ్రీనివాస్, కంసాలి బేతపూడికి చెందిన పాలి నారాయణ, సముద్రాల వెంకటేశ్వర్లును ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పి దమనకాండకు పాల్పడుతోందని.. అయినా ఉద్యమాన్ని విరమించేంది లేదని.. ఆక్వా పార్క్ నిర్మాణానికి అడ్డుకుని తీరతామని పోరాట కమిటీ నాయకులు ప్రకటించారు.
ఆక్వా పార్క్ వల్ల తలెత్తే సమస్యలివీ
ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల జల వనరులు, వాతావరణం కాలుష్యం బారిన పడతాయని.. ఈ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడతారని నిపుణులు హెచ్చరించడంతో ఉద్యమం మొదలైంది. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఏవీవీ స్వామి, రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన రంగరాజన్ వద్ద సలహాదారుడిగా పనిచేసిన ఎం.కృష్ణప్రసాద్ వంటి పర్యావరణ ప్రముఖులు ఈ ప్రాంతంలో పర్యటించారు. పరిసరాలను పరిశీలించిన నిపుణులు ఆక్వా పార్క్‌ను ఇక్కడ నిర్మించడం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పారు. రొయ్యలను ప్రోసెసింగ్ చేసే సందర్భంలో టన్నులకొద్దీ అమ్మోనియం వినియోగిస్తారని.. ఈ గ్యాస్ లీక్ అయితే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని స్పష్టం చేశారు. రొయ్యల ప్రోసెసింగ్ నిమిత్తం రోజుకు కనీసం రోజుకు 50 వేల లీటర్ల నీటిని వాడతారని, ఆ నీరంతా గొంతేరు డ్రెయిన్‌లో కలుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల డ్రెయిన్ కలుషితమై అందులోని మత్స్యసంపద అంతరించిపోవడంతోపాటు ఈ ప్రాంతంలోని జల వనరులన్నీ కలుషితమవుతాయని స్పష్టం చేశారు. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముందని, ఆక్వాపార్క్ పరిసర ప్రాంతాల్లోని పంట భూములకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. వాతావరణ కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడతారని, గర్భిణులు గర్భకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి
Advertisement
Advertisement