చెన్నేకొత్తపల్లి : ఉపాధ్యాయులు, పట్టభద్రుల డిమాండ్ల సాధనకు అవిశ్రాంతంగా పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండల కేంద్రంతోపాటు న్యామద్దెల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని పలువురు పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయడం ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. మోడల్, గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, సర్వీసు రూల్సు, రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచడం వంటి వాటి అమలుకు పోరాడతామన్నారు. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం, లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లించేవరకు పోరాడతామన్నారు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగులకు చెల్లించని భృతిని బకాయిల కింద చెల్లించేలా ఉద్యమిస్తామన్నారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఉన్నారు.