పోలవరం నిర్వాసితుల సమస్యలపై పోరాటం
Published Sun, Nov 13 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
26న అఖిపక్ష సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేపడతామని సీపీఐ రాష్ట్ర క్యాదర్శి కె.రామకృష్ణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని ఆర్థికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు నివాసం వద్ద ఆదివారం ఉభయగోదావరి జిల్లాల నిర్వాసితులు, రైతుల సమావేశం జరిగింది. సమావేశంలో నిర్వాసితుల తమ సమస్యలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై వివరించారు. ముఖ్యఅతిథిగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకూ పోరాడతామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40వేల కోట్లు ఖర్చుచేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.2 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొగ్గుచూపిస్తున్నారని విమర్శించారు. 2013 కొత్త భూసేకరణ కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిర్వాసితుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఈ నెల 26న విజయవాడలో అన్ని రాజకీయపార్టీల నాయకులు, రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి ప్రతి మండలం నుంచి నలుగురు నిర్వాసితులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు ఆర్.వెంకయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement