వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాటం
– ఆరు నెలల్లో ఎస్‌టీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి
– లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం
–స్పందించకపోతే టీడీపీని పాతరేస్తాం
– వీఆర్‌పీఎస్ సత్యాగ్రహ దీక్షలు ప్రారంభంలో సుభాష్ చంద్రబోస్
కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వాల్మీకి బిడ్డల బంగారు భవిష్యత్తుకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ అన్నారు. వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత కల్పన, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లపై శుక్రవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్‌లో ఆ సమితి మూడు రోజుల నిరవధిక సత్యాగ్రహ దీక్షలను ప్రారంభించింది. ముందుగా వందలాది మంది వాల్మీకులు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుంచి దీక్ష వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతు సత్యాగ్రహ దీక్షలు ముగిసేలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే జూన్‌లో రాయలసీమ బంద్‌కు కూడా వెనుకాడమన్నారు. సీమలోని నాలుగు జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తమ ఆందోళనలను చిన్నచూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వాల్మీకుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి ఫెడరేషన్‌కు వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని వాల్మీకులకు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్‌టీ రిజర్వేషన్‌లో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నారన్నారు. హింసాయుత ఉద్యమాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేస్తున్నట్లు ఆయన చర్యలను బట్టి అర్థమవుతుందన్నారు. తాము ఆగ్రహిస్తే రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, ఉపాధ్యక్షుడు జి. రాంభీంనాయుడు, ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా.మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి పరమటూరు శేఖర్, ప్రచార కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా నాయకులు మురళీ, రాముడు, వీజీఆర్ కొండయ్య, మహిళా నాయకురాలు ఎం. వాణిశ్రీ, న్యాయవాది తిమ్మప్ప, విద్యార్థి నాయకులు మహేంద్ర, బాబు, శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.