ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
Published Tue, Sep 13 2016 11:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
ఏలూరు (సెంట్రల్) : ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక పవర్‌పేటలోని సీపీఎం కార్యాలయం నుంచి వసంతమహల్ వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న మోగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల రెండు మండలాల గ్రామాల్లో మంచినీరు కలుషితమై భవిష్యత్‌లో తాగునీరు దొరకని పరిస్థితి వస్తుందని, పంట భూములు పాడైపోతాయన్నారు. ఇంతలా ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయటం కోసం ప్రజలను పణంగా పెడుతుందని ఆయన విమర్శించారు. ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలను అరెస్ట్ చేయడాన్ని సీతారామ్ ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత గుడిపాటి నరసింహారావు, డీఎన్‌వీడీ ప్రసాద్, కె.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement