బాబు అవినీతిపై పోరాటం ఉధృతం
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, పాలన వైఫల్యాలపై ప్రజాపోరాటాన్ని ఉధృతం చేస్తామని పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే హక్కు ఉన్నప్పటికీ, ఉద్యోగులను అమరావతికి తరలిస్తూ, చంద్రబాబు పాలనా యంత్రాంగాన్ని నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు.విజయవాడలోని పార్టీ కార్యాలయం లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ అవినీతి, దురాగతాలను ఎదుర్కోవడంపై చర్చిస్తామన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం బాబు నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి: పార్థసారథి
ఎన్నికల్లో వేలకోట్లు వెదజల్లిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని వేలంలో కొనుగోలు చేసినట్లు భావి స్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పార్థసారథి దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల హామీలను ఎంతవరకు అమలుచేసింది, ఎన్ని నిధులు కేటాయించింది శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. టీడీపీ నేత ఒకరు తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో రూ. 11వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకోబట్టే మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు. రూ.వెయ్యి కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను రూ. 22కోట్లకు టీడీపీ నేతలు అడ్డగోలుగా దక్కించుకున్నా దేవాదాయ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.