ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం పోరు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము
సిరిసిల్ల టౌన్ : పేదవిద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదలలపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేదవిద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తుందని తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నిర్వహించే ఫీజుపోరు దీక్షకు జిల్లా నుంచి విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు గుంటుకు సంపత్, మండల అధ్యక్షులు వంగరి అనిల్, బండి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.