నీటి రగడ | fighting for kli water | Sakshi
Sakshi News home page

నీటి రగడ

Published Fri, Sep 9 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

బిజినేపల్లి: అల్లీపూర్‌ శివారులో ఓటీ వద్ద పంట పొలాలపై వెళ్తున్న కేఎల్‌ఐ నీరు

బిజినేపల్లి: అల్లీపూర్‌ శివారులో ఓటీ వద్ద పంట పొలాలపై వెళ్తున్న కేఎల్‌ఐ నీరు

  •  పెద్దాపూర్, సల్కర్‌పేట, అల్లీపూర్, శాయిన్‌పల్లి శివారులో కేఎల్‌ఐ కాలువలకు గండికొట్టిన దుండగులు 
  •  అక్రమంగా చెరువులు నింపుకునే ప్రయత్నం 
  •  అడ్డుకుంటున్న ఆయా గ్రామాల రైతులు 
  •  గ్రామాల మధ్య పెరుగుతున్న నీటి వివాదం  
  • పన్నెండేళ్ల నిరీక్షణను తెరదించుతూ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేఎల్‌ఐ థర్డ్‌ లిఫ్ట్‌ (గుడిపల్లి రిజర్వాయర్‌) ద్వారా నీటిని విడుదల చేశారు. కేఎల్‌ఐ కాలువలో నీటి ప్రవాహం మొదలవ్వడంతో కాలువ చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులు రాత్రికి రాత్రే డిస్టిబ్యూటర్‌ కెనాల్స్‌కు గండ్లు పెట్టి తమ గ్రామ చెరువులను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామాల మధ్య నీటి రగడ మొదలైంది. నాగర్‌కర్నూల్‌ మండలంలోని పెద్దపూర్‌ సమీపంలో ఉన్న డిస్టిబ్యూటరీ కెనాల్‌కు పెద్దాపూర్‌ రైతులు, సల్కరపేట శివారులోని కాలువకు గోపాల్‌పేట మండలం పోల్కెపాడు రైతులు, అల్లీపూర్‌ శివారులో బుద్దారం రైతులు గండి కొట్టడంతో వివాదం ఏర్పడింది. మరోవైపు కాలువలకు గండి కొట్టడం వల్ల తమ పొలాల్లో నీళ్లు పారి వేసిన పంటలు కొట్టుకుపోయాయని ఆయా రైతులు ఆందోళన పడుతున్నారు.
    – నాగర్‌కర్నూల్‌ రూరల్‌/బిజినేపల్లి 
     
    నాగ సముద్రానికి చేరని నీరు
    గతేడాది నుంచి గుడిపల్లి రిజర్వాయర్‌ ద్వారా నీటిని విడుదల చేయాలని పాలకులు సూచిస్తున్నా కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయకపోవడం, డీపీల వద్ద తలుపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రధాన కాలువ వెంట వస్తున్న నీళ్లన్నీ ఎటు పడితే అటు వెళ్తున్నాయి. కనీసం చెరువులైనా నింపుకునేందుకు వీలు లేకుండా చేశారని పలు గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగనూల్‌ నాగ సముద్రానికి వచ్చే డిస్టిబ్యూటర్‌ కాలువ పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు కాలువలోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. దీనికి తోడు గుడిపల్లి లిఫ్ట్‌ నుంచి నాగసముద్రానికి నేరుగా ఉన్న డిస్టిబ్యూటరీ కాలువకు పెద్దాపూర్‌ శివారులో గండిపెట్టి నీళ్లను తీసుకెళ్తున్నారు. శుక్రవారం నాగనూల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాగర్‌కర్నూల్‌ సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీటీసీ చంద్రకళ, సర్పంచ్‌ శాంతమ్మ అక్కడికి వెళ్లి కేఎల్‌ఐ అధికారులకు ఫోన్‌ చేసినా తాము ఏం చేయలేమన్నట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 
     
    సల్కరపేట శివారులో ఉద్రిక్తత
    సల్కరపేట శివారులో 39.35కిలోమీటరు వద్ద నిర్మించిన యూటీ వద్ద గోపాల్‌పేట మండలం పొల్కెపాడుకు చెందిన రైతులు గురువారం రాత్రి కేఎల్‌ఐ కాలువకు గండి కొట్టి నీటిని తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో సల్కరపేటకి చెందిన రైతులు శ్రీశైలం, బలిజ శ్రీశైలం, కావలి స్వామి, వెంకట్‌రెడ్డిపై పొల్కెపాడు రైతులు దాడిచేసినట్లు వాపోయారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు తిరిగి కాలువను తెంచే ప్రయత్నం చేయడంతో సల్కరపేట రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ వీరబాబులు ఇరుగ్రామాల రైతులను శాంతిపజేశారు. యూటీ వద్ద తెంచిన కట్టను వెంటనే సరిచేయాలని ఈఈ లోకిలాల్‌ మధుకాన్‌ సిబ్బందికి సూచించడంతో కట్టకు మరమ్మతు చేశారు. 
     
    అల్లీపూర్‌ వద్ద తోపులాట
    అల్లీపూర్‌ శివారులోని ఓటీ ద్వారా అక్రమంగా నీటిని తీసుకెళ్తున్నారంటూ అల్లీపూర్‌ రైతులు గోపాల్‌పేట మండలం బుద్దారం రైతులతో వాగ్వివాదానికి దిగారు. ఇరు గ్రామాల రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. అక్రమంగా నీటిని తీసుకుపోవడం వల్ల పది ఎకరాల పొలం కోతకు గురైందని అల్లీపూర్‌కు చెందిన బాధిత రైతులు రాములు, చెన్నయ్య, మల్లయ్య, సత్యన్న, రాజు వాపోయారు. తమ పొలాల మీదుగా నీటి దోపిడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవ విషయం తెలుసుకున్న గోపాల్‌పేట పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను శాంతిపజేశారు.
     
    శాయిన్‌పల్లిలో వాగ్వివాదం
    పరిహారం ఇవ్వకపోవడంతో శాయిన్‌పల్లికి చెందిన కొందరు రైతులు తూము నుంచి నీటిని వెళ్లకుండా చేశారు. దీంతో శాయిన్‌పల్లి శివారులో యూటీకి గండి కొట్టి వడ్డెమాన్‌ భీమా సముద్రానికి నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో శాయిన్‌పల్లి, వడ్డెమాన్‌ గ్రామాల రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేఎల్‌ఐ అధికారులు వచ్చి పరిహారం ఇప్పిస్తామని శాయిన్‌పల్లి రైతులకు హామీ ఇవ్వడంతో తూము ద్వారా నీటని వదిలేందుకు ఒప్పుకున్నారు. దీంతో వడ్డెమాన్‌ రైతులు శాంతించారు. 
     
    నాశనమవుతున్న పంటలు..
    రైతులు డిస్టిబ్యూటర్‌ కాలువలకు గండ్లు ఏర్పాటు చేసి నీటిని చెరువులకు పారిస్తుండటం వల్ల కాలువ అంచు పొలాల్లో వేసిన పంటలన్నీ కోతలకు గురవుతున్నాయి. దీంతో నోటికాడికి వచ్చిన పంటలన్నీ నేలపాలవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇసుక మేటలు ఏర్పడి తమ పొలాలు పంటలు వేసేందుకు ఉపయోగం లేకుండా పోతాయని ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడిపల్లి వద్ద డిస్టిబ్యూటర్‌ కాలువకు రైతులు గండి పెట్టడం వల్ల నీళ్లన్నీ పొలాల వెంట వెళ్తున్న విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జక్కా రఘునందన్‌రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచే కేఎల్‌ఐ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. అన్ని చెరువుల్లోకి నీళ్లు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని, గండ్లు పడిన కాలువలను తక్షణం యంత్రాలను ఏర్పాటు చేసి బాగు చేయాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement