ఎత్తిపోతలకు బ్రేక్!
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తెంది. కృష్ణానదిలో లక్షల క్యూసెక్కుల నీరు పరుగులు పెడుతున్నా నీళ్లు తోడుకోలేని దుస్థితి ఏర్పడింది. కేఎల్ఐ రెండో లిఫ్ట్‌లో విద్యుత్ సాంకేతిక లోపం కారణంగా మూడు లిఫ్ట్‌ల పరిధిలోని నీటి పంపింగ్ నిలిచిపోయింది. కల్వకుర్తి మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు, ఎల్లూరు నుంచి సింగోటం, అక్కడి నుంచి జొన్నలబొగుడ రిజర్వాయర్‌కు వచ్చి చేరిన నీరు ముందుకు వెళ్లడం లేదు. గుడిపల్లి గట్టు వద్ద ఉన్న మూడో లిఫ్ట్‌లో సర్జిపూల్ పంపుల్లో విద్యుత్ వ్యవస్థకు పని చేయకపోవడంలో పంపింగ్ నిలిచిపోయింది. మూడో లిఫ్ట్ పనిచేయకపోవడం, ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్‌లలో కూడా నీటిని ఎత్తిపోయకుండా అధికారులు పంపులను నిలిపివేశారు.
దానికి తోడు కేఎల్ఐ ప్రాజెక్టు కింద నిర్మించిన రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో వరద వచ్చినపుడు లిప్ట్ చేసిన నీటిని నిల్వకు అవకాశం లేకుండాపోయింది. కేఎల్ఐ కింద ఉన్న మూడు రిజర్వాయర్లు కలిపి 3.396 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేందుకు 47అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్వే కూడా పూర్తి చేశారు. 19 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతి యేటా ఆయకట్టు లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వరద వచ్చిన సమయంలో లిఫ్ట్‌లను బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కేఎల్ఐ మూడు లిఫ్ట్‌లకు బ్రేక్..
కేఎల్ఐ మొదటి లిఫ్ట్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభమై 12రోజులు పూర్తయినా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇప్పటి వరకు మూడు రిజర్వాయర్లను మాత్రమే నింపుకొని సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్‌లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణాదికి వరద ప్రవాహం పెరగడంతో ఈనెల 1వ తేదీన ఇంజనీరింగ్ అధికారులు ఎల్లూరు వద్ద మూడు పంపులను ప్రారంభించారు. ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. మూడు పంపుల నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి జొన్నలబొగుడ ఎత్తిపోతల పథకానికి గ్రావిటీ ద్వారా సర్జ్‌పూల్‌లోకి విడుదల చేశారు.
కేఎల్ఐ రెండో లిఫ్ట్ జొన్నలబొగుడ నుంచి పంపుల ద్వారా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2.14 టీఎంసీల సామర్థ్యం ఉన్న జొన్నలబొగడ రిజర్వాయర్ కూడా నిండింది. అయితే అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గుడిపల్లి గట్టు లిఫ్ట్ వద్ద విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలను తలెత్తడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. అలాగే గుడిపల్లి గట్టు సమస్యతో జొన్నలబొగడ ప్రధాన కాల్వ నుంచి పుస్పుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 43వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా దానిని నిలిపివేశారు. జొన్నలబొగడ నుంచి వచ్చే నీరు నేరుగా గుడిపల్లి గట్టు సర్జ్‌పూల్‌లోకి వెళ్తాయి.
జొన్నలబొగుడ నుంచి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం కాగానే పస్పుల బ్రాంచ్ కెనాల్‌కు నీటిని వదలాల్సి ఉంటుంది. గుడిపల్లి గట్టు వద్ద ఎదురైన సాంకేతిక సమస్య కారణంగా నీటి పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మొదటి, రెండో లిఫ్ట్‌ల వద్ద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్‌ల వద్ద కూడా అధికారులు నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. గుడిపల్లి గట్టు నుంచి 30వ ప్యాకేజీ పరిధిలోని 90కి.మీ. కెనాల్ ద్వారా 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, అదే విధంగా 29వ ప్యాకేజీ పరిధిలోని 220కి.మీ.ల కెనాల్ ద్వారా 2.17లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు నిర్ధారించారు. పస్పుల బ్రాంచ్ కెనాల్‌తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 3.07లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు.
నెరవేరని 4.35 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఈ పథకంలో మొదట్లో 2.5లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా ప్రస్తుతం 4.35లక్షల ఎకరాలకు చేరింది. నీటి కేటాయింపు కూడా 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో దాదాపు 450చెరువులను నింపి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 16 మండలాల్లో 2,97,496 ఎకరాలకు, వనపర్తి జిల్లాలోని 6 మండలాల పరిధిలో 89,733 ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 15,504 ఎకరాలకు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని 21,372 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు.
ఈ ఏడాది 3.07లక్షల ఎకరాలు సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. వరద వచ్చినప్పుడు నీటిని తోడుకోవాల్సి ఉంటుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం మూడు లిఫ్ట్‌ల నుంచి నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. దానికి తోడు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు తక్కువగా ఉన్నాయి. 47 అదనపు రిజర్వాయర్లు నిర్మించేందుకు అధికారులు సర్వేలు నిర్వహించారు. 20 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు కానీ అనుమతి రాలేదు. అదనపు రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది.
రెండు రోజుల్లో ప్రారంభిస్తాం
గుడిపల్లి గట్టు వద్ద ఉన్న కేఎల్ఐ మూడో లిఫ్ట్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సాంకేతిక సమస్య వల్ల నీటి ఎత్తిపోతను ప్రారంభించలేదు. బుధవారం మధ్యాహ్నం మూడో లిఫ్ట్‌ను ప్రారంభించి నీటిని గుడిపల్లి రిజర్వాయర్‌లోకి విడుదల చేస్తాం. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండడం వల్ల మొదటి, రెండో లిఫ్ట్‌లను నిలిపివేశాం. అదనపు రిజర్వాయర్లకు సంబంధించి సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.
– రమేష్ జాదవ్, ఈఈ, కేఎల్ఐ