Kalwakurthy Lift Irrigation project
-
ఎత్తిపోతలకు బ్రేక్!
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తెంది. కృష్ణానదిలో లక్షల క్యూసెక్కుల నీరు పరుగులు పెడుతున్నా నీళ్లు తోడుకోలేని దుస్థితి ఏర్పడింది. కేఎల్ఐ రెండో లిఫ్ట్‌లో విద్యుత్ సాంకేతిక లోపం కారణంగా మూడు లిఫ్ట్‌ల పరిధిలోని నీటి పంపింగ్ నిలిచిపోయింది. కల్వకుర్తి మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు, ఎల్లూరు నుంచి సింగోటం, అక్కడి నుంచి జొన్నలబొగుడ రిజర్వాయర్‌కు వచ్చి చేరిన నీరు ముందుకు వెళ్లడం లేదు. గుడిపల్లి గట్టు వద్ద ఉన్న మూడో లిఫ్ట్‌లో సర్జిపూల్ పంపుల్లో విద్యుత్ వ్యవస్థకు పని చేయకపోవడంలో పంపింగ్ నిలిచిపోయింది. మూడో లిఫ్ట్ పనిచేయకపోవడం, ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్‌లలో కూడా నీటిని ఎత్తిపోయకుండా అధికారులు పంపులను నిలిపివేశారు. దానికి తోడు కేఎల్ఐ ప్రాజెక్టు కింద నిర్మించిన రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో వరద వచ్చినపుడు లిప్ట్ చేసిన నీటిని నిల్వకు అవకాశం లేకుండాపోయింది. కేఎల్ఐ కింద ఉన్న మూడు రిజర్వాయర్లు కలిపి 3.396 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేందుకు 47అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్వే కూడా పూర్తి చేశారు. 19 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతి యేటా ఆయకట్టు లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వరద వచ్చిన సమయంలో లిఫ్ట్‌లను బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేఎల్ఐ మూడు లిఫ్ట్‌లకు బ్రేక్.. కేఎల్ఐ మొదటి లిఫ్ట్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభమై 12రోజులు పూర్తయినా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇప్పటి వరకు మూడు రిజర్వాయర్లను మాత్రమే నింపుకొని సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్‌లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణాదికి వరద ప్రవాహం పెరగడంతో ఈనెల 1వ తేదీన ఇంజనీరింగ్ అధికారులు ఎల్లూరు వద్ద మూడు పంపులను ప్రారంభించారు. ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. మూడు పంపుల నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి జొన్నలబొగుడ ఎత్తిపోతల పథకానికి గ్రావిటీ ద్వారా సర్జ్‌పూల్‌లోకి విడుదల చేశారు. కేఎల్ఐ రెండో లిఫ్ట్ జొన్నలబొగుడ నుంచి పంపుల ద్వారా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2.14 టీఎంసీల సామర్థ్యం ఉన్న జొన్నలబొగడ రిజర్వాయర్ కూడా నిండింది. అయితే అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గుడిపల్లి గట్టు లిఫ్ట్ వద్ద విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలను తలెత్తడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. అలాగే గుడిపల్లి గట్టు సమస్యతో జొన్నలబొగడ ప్రధాన కాల్వ నుంచి పుస్పుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 43వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా దానిని నిలిపివేశారు. జొన్నలబొగడ నుంచి వచ్చే నీరు నేరుగా గుడిపల్లి గట్టు సర్జ్‌పూల్‌లోకి వెళ్తాయి. జొన్నలబొగుడ నుంచి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం కాగానే పస్పుల బ్రాంచ్ కెనాల్‌కు నీటిని వదలాల్సి ఉంటుంది. గుడిపల్లి గట్టు వద్ద ఎదురైన సాంకేతిక సమస్య కారణంగా నీటి పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మొదటి, రెండో లిఫ్ట్‌ల వద్ద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్‌ల వద్ద కూడా అధికారులు నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. గుడిపల్లి గట్టు నుంచి 30వ ప్యాకేజీ పరిధిలోని 90కి.మీ. కెనాల్ ద్వారా 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, అదే విధంగా 29వ ప్యాకేజీ పరిధిలోని 220కి.మీ.ల కెనాల్ ద్వారా 2.17లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు నిర్ధారించారు. పస్పుల బ్రాంచ్ కెనాల్‌తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 3.07లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. నెరవేరని 4.35 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఈ పథకంలో మొదట్లో 2.5లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా ప్రస్తుతం 4.35లక్షల ఎకరాలకు చేరింది. నీటి కేటాయింపు కూడా 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో దాదాపు 450చెరువులను నింపి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 16 మండలాల్లో 2,97,496 ఎకరాలకు, వనపర్తి జిల్లాలోని 6 మండలాల పరిధిలో 89,733 ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 15,504 ఎకరాలకు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని 21,372 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ఈ ఏడాది 3.07లక్షల ఎకరాలు సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. వరద వచ్చినప్పుడు నీటిని తోడుకోవాల్సి ఉంటుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం మూడు లిఫ్ట్‌ల నుంచి నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. దానికి తోడు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు తక్కువగా ఉన్నాయి. 47 అదనపు రిజర్వాయర్లు నిర్మించేందుకు అధికారులు సర్వేలు నిర్వహించారు. 20 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు కానీ అనుమతి రాలేదు. అదనపు రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ప్రారంభిస్తాం గుడిపల్లి గట్టు వద్ద ఉన్న కేఎల్ఐ మూడో లిఫ్ట్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సాంకేతిక సమస్య వల్ల నీటి ఎత్తిపోతను ప్రారంభించలేదు. బుధవారం మధ్యాహ్నం మూడో లిఫ్ట్‌ను ప్రారంభించి నీటిని గుడిపల్లి రిజర్వాయర్‌లోకి విడుదల చేస్తాం. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండడం వల్ల మొదటి, రెండో లిఫ్ట్‌లను నిలిపివేశాం. అదనపు రిజర్వాయర్లకు సంబంధించి సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. – రమేష్ జాదవ్, ఈఈ, కేఎల్ఐ -
పంపులకు ‘పవర్’ కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది. ఏడాదిగా దాటవేతే.. రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా రూ.777.45 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేసింది. తదనంతరం తాజాగా జొన్నలబొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పడు, విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. మున్ముందు సవాళ్లే... ఇక ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా.. ప్రాజెక్టు ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) విద్యుత్ బిల్లు బకాయి(రూ. కోట్లలో) కల్వకుర్తి 31 777.45 నెట్టెంపాడు 6.78 104.70 బీమా 12.12 74.85 మొత్తం 49.90 957 -
కల్వకుర్తికి అన్యాయంపై పోరాటం
కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయని, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జూలై 2016 నాటికే సాగునీటిని అందిస్తామని టీఆర్ఎస్ హామీ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోలేని అసమర్థ టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
నీటి రగడ
పెద్దాపూర్, సల్కర్‌పేట, అల్లీపూర్, శాయిన్‌పల్లి శివారులో కేఎల్ఐ కాలువలకు గండికొట్టిన దుండగులు అక్రమంగా చెరువులు నింపుకునే ప్రయత్నం అడ్డుకుంటున్న ఆయా గ్రామాల రైతులు గ్రామాల మధ్య పెరుగుతున్న నీటి వివాదం పన్నెండేళ్ల నిరీక్షణను తెరదించుతూ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేఎల్ఐ థర్డ్ లిఫ్ట్ (గుడిపల్లి రిజర్వాయర్) ద్వారా నీటిని విడుదల చేశారు. కేఎల్ఐ కాలువలో నీటి ప్రవాహం మొదలవ్వడంతో కాలువ చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులు రాత్రికి రాత్రే డిస్టిబ్యూటర్ కెనాల్స్‌కు గండ్లు పెట్టి తమ గ్రామ చెరువులను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామాల మధ్య నీటి రగడ మొదలైంది. నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దపూర్ సమీపంలో ఉన్న డిస్టిబ్యూటరీ కెనాల్‌కు పెద్దాపూర్ రైతులు, సల్కరపేట శివారులోని కాలువకు గోపాల్పేట మండలం పోల్కెపాడు రైతులు, అల్లీపూర్ శివారులో బుద్దారం రైతులు గండి కొట్టడంతో వివాదం ఏర్పడింది. మరోవైపు కాలువలకు గండి కొట్టడం వల్ల తమ పొలాల్లో నీళ్లు పారి వేసిన పంటలు కొట్టుకుపోయాయని ఆయా రైతులు ఆందోళన పడుతున్నారు. – నాగర్‌కర్నూల్ రూరల్/బిజినేపల్లి నాగ సముద్రానికి చేరని నీరు గతేడాది నుంచి గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయాలని పాలకులు సూచిస్తున్నా కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయకపోవడం, డీపీల వద్ద తలుపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రధాన కాలువ వెంట వస్తున్న నీళ్లన్నీ ఎటు పడితే అటు వెళ్తున్నాయి. కనీసం చెరువులైనా నింపుకునేందుకు వీలు లేకుండా చేశారని పలు గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగనూల్ నాగ సముద్రానికి వచ్చే డిస్టిబ్యూటర్ కాలువ పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు కాలువలోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. దీనికి తోడు గుడిపల్లి లిఫ్ట్ నుంచి నాగసముద్రానికి నేరుగా ఉన్న డిస్టిబ్యూటరీ కాలువకు పెద్దాపూర్ శివారులో గండిపెట్టి నీళ్లను తీసుకెళ్తున్నారు. శుక్రవారం నాగనూల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాగర్‌కర్నూల్ సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీటీసీ చంద్రకళ, సర్పంచ్ శాంతమ్మ అక్కడికి వెళ్లి కేఎల్ఐ అధికారులకు ఫోన్ చేసినా తాము ఏం చేయలేమన్నట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సల్కరపేట శివారులో ఉద్రిక్తత సల్కరపేట శివారులో 39.35కిలోమీటరు వద్ద నిర్మించిన యూటీ వద్ద గోపాల్పేట మండలం పొల్కెపాడుకు చెందిన రైతులు గురువారం రాత్రి కేఎల్ఐ కాలువకు గండి కొట్టి నీటిని తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో సల్కరపేటకి చెందిన రైతులు శ్రీశైలం, బలిజ శ్రీశైలం, కావలి స్వామి, వెంకట్‌రెడ్డిపై పొల్కెపాడు రైతులు దాడిచేసినట్లు వాపోయారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు తిరిగి కాలువను తెంచే ప్రయత్నం చేయడంతో సల్కరపేట రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ సీఐ రాంబాబు, ఎస్ఐ వీరబాబులు ఇరుగ్రామాల రైతులను శాంతిపజేశారు. యూటీ వద్ద తెంచిన కట్టను వెంటనే సరిచేయాలని ఈఈ లోకిలాల్ మధుకాన్ సిబ్బందికి సూచించడంతో కట్టకు మరమ్మతు చేశారు. అల్లీపూర్ వద్ద తోపులాట అల్లీపూర్ శివారులోని ఓటీ ద్వారా అక్రమంగా నీటిని తీసుకెళ్తున్నారంటూ అల్లీపూర్ రైతులు గోపాల్పేట మండలం బుద్దారం రైతులతో వాగ్వివాదానికి దిగారు. ఇరు గ్రామాల రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. అక్రమంగా నీటిని తీసుకుపోవడం వల్ల పది ఎకరాల పొలం కోతకు గురైందని అల్లీపూర్‌కు చెందిన బాధిత రైతులు రాములు, చెన్నయ్య, మల్లయ్య, సత్యన్న, రాజు వాపోయారు. తమ పొలాల మీదుగా నీటి దోపిడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవ విషయం తెలుసుకున్న గోపాల్పేట పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను శాంతిపజేశారు. శాయిన్‌పల్లిలో వాగ్వివాదం పరిహారం ఇవ్వకపోవడంతో శాయిన్‌పల్లికి చెందిన కొందరు రైతులు తూము నుంచి నీటిని వెళ్లకుండా చేశారు. దీంతో శాయిన్‌పల్లి శివారులో యూటీకి గండి కొట్టి వడ్డెమాన్ భీమా సముద్రానికి నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో శాయిన్‌పల్లి, వడ్డెమాన్ గ్రామాల రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేఎల్ఐ అధికారులు వచ్చి పరిహారం ఇప్పిస్తామని శాయిన్‌పల్లి రైతులకు హామీ ఇవ్వడంతో తూము ద్వారా నీటని వదిలేందుకు ఒప్పుకున్నారు. దీంతో వడ్డెమాన్ రైతులు శాంతించారు. నాశనమవుతున్న పంటలు.. రైతులు డిస్టిబ్యూటర్ కాలువలకు గండ్లు ఏర్పాటు చేసి నీటిని చెరువులకు పారిస్తుండటం వల్ల కాలువ అంచు పొలాల్లో వేసిన పంటలన్నీ కోతలకు గురవుతున్నాయి. దీంతో నోటికాడికి వచ్చిన పంటలన్నీ నేలపాలవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇసుక మేటలు ఏర్పడి తమ పొలాలు పంటలు వేసేందుకు ఉపయోగం లేకుండా పోతాయని ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడిపల్లి వద్ద డిస్టిబ్యూటర్ కాలువకు రైతులు గండి పెట్టడం వల్ల నీళ్లన్నీ పొలాల వెంట వెళ్తున్న విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నేత జక్కా రఘునందన్‌రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచే కేఎల్ఐ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. అన్ని చెరువుల్లోకి నీళ్లు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని, గండ్లు పడిన కాలువలను తక్షణం యంత్రాలను ఏర్పాటు చేసి బాగు చేయాలని సూచించారు. -
నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు
కేఎల్ఐ లిఫ్ట్–2, 3 ప్రారంభోత్సవం గుడిపల్లి గట్టు వద్ద బహిరంగసభ మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్–2ను ప్రారంభించనున్నారు. జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి సాగునీటిని విడుదల చేయనున్నారు. మంత్రి ఉదయం 11 గంటలకు పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద కల్వకుర్తి లిఫ్ట్–2 ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జొన్నల బొగుడ రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తారని కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లిఫ్ట్–3 పరిధిలోని గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ను ప్రారంభించి కాల్వలకు నీరు వదులుతారని, అక్కడకూడా నిర్వహించే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మంత్రులు హైదరాబాద్ బయలుదేరి వెళతారు.