
రైల్వే జోన్ సాధించే వరకు పోరాటం
♦ కేంద్రం కళ్లు తెరిపిస్తాం: వైఎస్సార్‌సీపీ నేత బొత్స
♦ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రగతికి జీవనాడి అయిన విశాఖ రైల్వేజోన్‌ను సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్‌నూ చేర్చారని, విశాఖలో జోన్ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని, కానీ కేంద్రం దాన్ని అమలు చే యకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద తెన్నేటి విశ్వనాథం ప్రాంగణంలో గురువారం ఉదయం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అంతకుముందు డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి అమర్‌నాథ్, పార్టీ నేతలతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అమర్‌నాథ్ దీక్షతో కేంద్రం కళ్లు తెరుస్తుందని, రైల్వే జోన్ సాధించి తీరుతామని చెప్పారు. జోన్ కోసం బీజేపీ, టీడీపీలు కూడా కలసి రావాలని, లేదంటే జోన్ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
రైల్వే జోన్ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, చంద్రబాబులు చెప్పారనీ, రెండేళ్లవుతున్నా హామీ నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్న స్ఫూర్తితోనే విశాఖ రైల్వేజోన్‌ను సాధిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేద్దాం: వైఎస్ జగన్
‘రైల్వేజోన్ కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు పూర్తిగా ఉంది. పార్టీ యావత్తూ నీ వెంట నిలుస్తుంది. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేద్దాం..’ అని గుడివాడ అమర్‌నాథ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్‌తో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. దీక్షకు మద్దతుగా రాష్ట్ర పార్టీ తరఫున ఎంపీల బృందాన్ని పంపుతామని చెప్పారు. విశాఖపట్నం రైల్వేజోన్ సాధనే పార్టీ ధ్యేయమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని జగన్ సూచించారు.