రైతుల్లో ఆత్మస్థైర్యం నింపండి...
♦ ఆ దిశగా గట్టి చర్యలు చేపట్టండి
♦ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టీకరణ
♦ రైతుల ఆత్మహత్యల మీద దాఖలైన పిటిషన్లపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు నిరోధించేందుకుగాను రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు పేర్కొంది. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో క్షేత్రస్థాయిలో కారణాలను అన్వేషించాలని సూచించింది. ఈ దిశగా గట్టి చర్యలు చేపట్టాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అంతేగాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మూడురోజుల్లో పరిహారమందేలా చూడాలని, ఆ మొత్తం నేరుగా వారి బ్యాంకుఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ప్రభుత్వ పథకాలు, వాటివల్ల కలుగుతున్న ప్రయోజనాలు.. తదితర విషయాల్లో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.
రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే హక్కుల విషయంలో వారిని చైతన్యవంతులు చేయాలంది. రైతుల సంక్షేమంకోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బాగున్నప్పటికీ... అవి రైతులకు క్షేత్రస్థాయిలో మరింత చేరువయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వాల పురోగతిని పరిశీలిస్తామంటూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవడం తెలిసిందే. వీటిని విచారించిన ధర్మాసనం.. తామడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏజీ, అదనపు ఏజీ, కనీసం స్పెషల్ జీపీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తపరుస్తూ.. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిని మంగళవారం వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలివ్వడమూ విదితమే.
ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. సోమవారంనాటి ఘటనకుగాను క్షమాపణలు కోరారు. అనంతరం వాదనలు కొనసాగిస్తూ.. రైతుల్లో మనోస్థైర్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ.. ఆత్మహత్యల నివారణకు చేపట్టిన కార్యక్రమాల్ని నివేదించారు.
ఆత్మహత్యలకు అవినీతే కారణం...
ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పెచ్చుమీరిపోతున్న అవినీతీ రైతుల ఆత్మహత్యలకు ఓ ప్రధాన కారణమని అభిప్రాయపడింది. రైతులు తాము సంపాదించిన కొద్దిమొత్తంలో లంచానికే అధికమొత్తం ఖర్చుచేయాల్సిన పరిస్థితులున్నాయని, ఇరుప్రభుత్వాలూ దీన్ని మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. లంచమడిగిన వారి వివరాలు, ఫొటోలు ఆడియో, వీడియోలద్వారా ఉన్నతాధికారులకు చేరే సౌలభ్యాన్ని ప్రజలకందుబాటులో ఉంచాలంది. అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రాగానే ఆ అధికారిని సస్పెండ్ చేయాలంది.
కోదండరాం సూచనలను పాటిస్తాం...
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ప్రొ.కోదండరాం తన ఇంప్లీడ్ పిటిషన్‌లో చక్కని సూచనలు, పరిష్కారాలు చెప్పారని, వాటిని పాటించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ సర్కారు కూడా ఆ సూచనలను ఎందుకు అమలు చేయకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఏజీ వేణుగోపాల్ వాటిని తాము పరిశీలిస్తామన్నారు.