సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు విషయంలో చంద్రబాబు తన రికార్డును తానే బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది పత్తిసాగు పెరిగినా.. వర్షాలకు 90 శాతం పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ రంగు పురుగు వేగంగా విస్తరించి.. పత్తి పంటను సర్వనాశనం చేస్తోందన్నారు. దీనిపై రైతులకు తగిన సలహాలివ్వాల్సిన ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు.
మరోవైపు తక్కువ మొత్తంలో సాగు చేస్తున్న వేరుశనగ, పెసర తదితరాలు కూడా వర్షాభావం, అధిక వర్షాలకు తుడిచిపెట్టుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ పత్తి ఉత్పత్తి చేయాలంటే రూ.5,500 వరకు ఖర్చవుతుందని, కానీ మద్దతు ధరను రూ.4,320గా ప్రకటించారని మండిపడ్డారు. కనీసం అదైనా రైతులకు అందుతుందా? అంటే అదీ లేదన్నారు.
ఉత్తరాదిలో గోధుమకు మద్దతు ధర పెంచారని, అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో వరికి మద్దతు ధర ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ రంగం ఇంత సంక్షోభంలో ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని మండిపడ్డారు. మోసపూరిత విధానాలు విడిచిపెట్టి రైతులను ఆదుకుకోవాలనిని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
Published Thu, Nov 2 2017 3:53 AM | Last Updated on Sat, Jul 6 2019 12:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment