రియల్ దొరలెందరో?! | Financial Capital on Rowdy Sheeter Real Business | Sakshi
Sakshi News home page

రియల్ దొరలెందరో?!

Published Sun, Jun 26 2016 3:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

రియల్ దొరలెందరో?!

రియల్ దొరలెందరో?!

జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. రియల్ బూమ్ ఆకాశాన్నంటిన నేపథ్యంలో సందుకొకరు, వీధికొకరుగా బ్రోకర్లు, రియల్టర్లు పుట్టుకొచ్చారు. వీరికి అండగా రౌడీషీటర్లు రంగంలోకొచ్చారు. ప్రతి ఏరియాలోనూ భూదందాలు మొదలుపెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక్క స్థలాన్నే పదిమందికి అమ్మేయడం, ఐదారుగురికి రిజిస్ట్రేషన్ చేయించడం..

చివరికి సెటిల్‌మెంట్ చేసి బలవంతులకు అప్పగించడం.. ఈ తరహా సెటిల్‌మెంట్లు నగరంతోపాటు, శివారు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా నిత్యకృత్యమయ్యాయి. అసలు బ్రోకర్లు, రియల్టర్లు, రౌడీషీటర్లు.. వీళ్లంతా ఎందుకు?.. మనమే రియల్ వ్యవహారాలన్నీ సెటిల్ చేస్తే కోట్లకు కోట్లు  కొట్టేయొచ్చని కొందరు పోలీసులు భావించారు. అంతే.. విశాఖ నగరం, జిల్లాలోని చాలామంది పోలీసులు రియల్ బాట పట్టారు.  ఎస్సైలు, సీఐలు మొదలు ఎక్కడి నుంచో నగరానికి బదలీపై వచ్చిన ఉన్నతాధికారుల వరకు బినామీల పేరిట రియల్ వ్యాపారం మొదలెట్టేస్తున్నారు.
   
భీమిలిలో ఓ పోలీసాయన అసలు ఉద్యోగాన్ని తూతూ మంత్రంగా చేస్తూ నిత్యం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లోనే మునిగితేలుతుంటాడు. సంగివలస, నమ్మివానిపేట, ఆదర్శనగర్, కాపులుప్పాడ ప్రాంతాల్లో ఇటీవల కబ్జాల వివాదాలు పెరిగాయి.  దీన్నే ఆసరా చేసుకున్న సదరు ఖాకీ స్వయంగా పంచాయితీలు చేసి ‘నాకింత... మీకింత’ పద్ధతిలో సుమారు రూ.40 కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయనకు రూ.15 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన గారు చేసే పంచాయితీలకు భీమిలి స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జి వేదికవుతోంది. ఆ లాడ్జి కూడా ఆయనదేనని, బావమరిది పేరిట తీసుకున్నారన్న ప్రచారం ఉంది.
   
ఆనందపురంలో మరో పోలీసాయన ల్యాండ్ సెటిల్‌మెంట్ల ద్వారా రూ.కోట్లకు పడగలెత్తాడు. ఇసుక లారీలపై తప్పుడు కేసులు బనాయించి డ్రైవర్లు, ఓనర్ల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తారన్న ఆరోపణలపై ఈయన్ను పై అధికారులు తలంటినా మార్పు రాలేదని అంటున్నారు. 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ డీఎస్పీ కూడా రియల్ సెటిల్‌మెంట్ల ద్వారానే కోట్లకు పడగలెత్తాడని అంటున్నారు. ఒక్క విశాఖ నగరంలోనే యాభై కోట్ల విలువైన స్థిరచరాస్తులు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే వేస్తున్న లెక్క. ఆ మధ్య మధురవాడలో ఏకండిగా 18ఎకరాల భూమిని బినామీల పేరిట కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేయడం, మంచి ధర వస్తే అమ్మేయడం.. ఇలా భూక్రయవిక్రయాల్లోనే సదరు పోలీసు అధికారి మునిగి తేలుతుంటాడని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు.
   
ఈ మధ్యనే నగరం నుంచి బదలీ అయిన ఓ ఉన్నతాధికారి రియల్ పంచాయితీల ద్వారా రూ.20 కోట్లు వెనకేసుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఉత్తరాదికి చెందిన అధికారే అయినప్పటికీ విశాఖలో బినామీల పేరిట భూములు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే చెబుతున్న మాట. ఓ డివిజన్ స్థాయి అధికారి నగరంలో తన సోదరుడి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా చేసేస్తున్నారు.  నగరంలో లెక్కలేనన్ని భూదందాలతో కబ్జాదారుడిగా లోకాయుక్త విచారణ కూడా ఎదుర్కొన్నసోదరుడికి ఆ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. సోదరుడు వేసిన సుమారు 20 రియల్ వెంచర్లకు పెట్టుబడితో పాటు అండదండలన్నీ సదరు అధికారే అందిస్తుంటారు.

గాజువాకలో ఖల్‌నాయక్ కూర్మన్నపాలెంలో ఆ మధ్య ఓ  భూమి విషయంలో కొనుగోలుదారులు, కబ్జారాయుళ్ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. లే అవుట్లు చెల్లవంటూ కబ్జారాయుళ్లు ఆ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో కొనుగోలుదారులు దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు  చూపించారు.

విచారణ చేపట్టిన పోలీసులు కొనుగోలుదారులకు మద్దతుగా నిలిచారు. దీంతో కబ్జారాయుళ్లు ఓ పోలీసు అధికారిని ఆశ్రయించి డీల్ కుదుర్చుకున్నారు. సుమారు రూ.3 కోట్లకు బేరం కుదరడంతో ఆ అధికారి అక్రమార్కుల వైపు  నిలబడ్డారు. కొనుగోలుదారులపై రౌడీషీట్‌లు తెరవాలని ఆదేశించారు. మొత్తంగా ఆ భూమిని కబ్జారాయుళ్ల పరం చేసేశారు.
   
గాజువాక పరిధిలో ఇప్పుడు పనిచేస్తున్న 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి రియల్ దందాలే పెట్టుబడిగా కోట్లకు పడగలెత్తాడు. గతంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కినా ఆర్నెల్లలోపే తిరిగి పోస్టింగ్ సాధించుకున్న ఘనుడిగా పోలీసువర్గాల్లో పేరు సంపాదించాడు.
 విజయవనగరం జిల్లా కొత్తవలస, జీడివలస, రాజాం, గరివిడి ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేశారన్న ప్రచారం ఉంది.
   
ఆరిలోవ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారే ఇప్పుడు ఆ ఏరియాలో పెద్ద రియల్ బ్రోకర్. అక్కడ స్థలాలు అమ్మాలన్నా, కొన్నాలన్న ఆ అధికారిని సంప్రదిస్తే చాలు. అన్నీ సెటిల్ చేసేస్తారు.  భూకబ్జారాయుళ్లకు, దందాలు చేసే వాళ్లకు ఈయనే అండ. 1996 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆ అధికారి గతంలో నర్సీపట్నంలో పనిచేసినప్పుడు రంగురాళ్ల వ్యాపారం చేసి రూ.కోట్లకు పడగలెత్తారు. ఆయనకు వాల్వో బస్సులు కూడా ఉన్నాయంటే మనోడి సంపాదన ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
   
నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 1996 ఎస్సై బ్యాచ్‌కే చెందిన మరో అధికారి పూర్తిగా రియల్ వ్యాపారం మీదే దృష్టి పెట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో గతంలో పనిచేసినప్పుడు  రైస్ పుల్లింగ్ గ్యాంగులతో మిలాఖత్ అయ్యారు. అప్పుడు అడ్డంగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారు.
 పద్యాలు, కవితలతో పై అధికారులను బుట్టలో వేసుకునే పోలీస్‌గా పేరున్న సదరు ఖాకీ సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో విలువైన భూములు కొన్నాడని అంటున్నారు. ఏసీబీకి దొరికినోడు దొంగ.. దొరక్కపోతే దొర చందంగా నడిచిపోతున్న నేపథ్యంలో ఈ రియల్ పోలీసుల పని పట్టేదెవరో?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement