జనజీవనం.. చిల్లర వందర
జనజీవనం.. చిల్లర వందర
Published Tue, Nov 15 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
- పెద్దనోట్ల రద్దుతో గ్రామాల్లో ఆర్థిక సంక్షోభం
- రూ. వంద నోట్ల కరువుతో జనం విలవిల
- మూడు వారాల తర్వాతే అందుబాటులోకి ఏటీఎంలు
- రూ. 100 నోట్లు కరువు
- జిల్లాకు ఇంకా రాని రూ. 500 నోట్లు
డబ్బుకు ఉన్నోడు.. లేనోడు అనే తేడా లేనట్లు నోట్ల మార్పిడితో ఎదురవుతున్న కష్టాలకు అందరూ బాధితులయ్యారు. కష్టపడి సంపాదించిన నోట్లు మార్చుకునేందుకు కూలీలు, వ్యాపారులు, కుటుంబ అవసరాలకు దాచుకున్న సొమ్మును డిపాజిట్ చేసేందుకు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులు బ్యాంకులు తెరవక ముందే గేట్ల ముందర వాలిపోతున్నారు. గంటల తరబడి నిలబడి నోట్లు మార్చుకుంటున్నారు. మరో వైపు పనులు లేక.. వ్యాపారు లేక.. అవసరాలకు డబ్బులందక.. జీనజీవనం చిందర వందర అవుతోంది. నోట్ల పాట్లు అంచనాకు అందడం లేదు.
- కర్నూలు (అగ్రికల్చర్)
పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. పెద్దనోట్లు రద్దు చేసి వారం రోజులు అవుతున్నా ఽనగదు కొరత తీరకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మరిన్ని రోజులు ఆర్థిక సంక్షోభం తప్పదని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. నగదు కొరతతో పంట ఉత్పత్తులను అమ్ముకునే వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూతపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్య తీవ్ర రూపం దాల్చిందనేందుకు 20 శాతం కమీషన్ ఇచ్చి నోట్లు మార్చుకోవడమే నిదర్శనం. జిల్లాలో 403 ఏటీఎంలు ఉన్నా ఇందులో 50 కూడా పనిచేయడం లేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మరో మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన రూ.2000 నోట్ల సైజు తగ్గిపోయింది. త్వరలో జిల్లాలోకి రానున్న 500 నోట్ల సైజు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. రూ.2000, 500 నోట్లను ఏటీఎంలలో పెట్టాలంటే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు అవసరమయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అంతవరకు రూ.100, 50 నోట్ల మాత్రమే ఏటీఎంలలో పెట్టుకోవాలని ఉన్నత స్థాయి బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. రూ. వంద, 50 నోట్లకు తీవ్రమైన కొరత ఉండటంతో ఏటీఎంలు అందుబాటులోకి రావడం లేదు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, విజయబ్యాంకులకు మాత్రమే ఆర్‌బీఐ కరెన్సీ చస్ట్‌లు ఉన్నాయి. రూ. వంద, 50 నోట్ల ఈ బ్యాంకులకు మాత్రమే వస్తున్నందున వీటికి సంబంధించిన ఏటీఎంలు కొద్దిమేర పనిచేస్తున్నాయి. మిగతా ఏటీఎంలు పనిచేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులకు పోటెత్తుతున్నారు.
డిపాజిట్లు 1800 కోట్లు... మార్పిడి రూ. 60కోట్లు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంతో బ్యాంకులకు డిపాజిట్లు పోటెత్తుతున్నాయి. అదే సమయంలో నోట్ల మార్పిడికి ప్రజలు క్యూ కడుతున్నా ఇప్పటి వరకు జరిగిన మార్పిడి అంతంత మాత్రమే. కొన్ని బ్యాంకులకు పెద్దనోట్ల రద్దుకు ముందు ఎస్‌బీఐ ఖాతాల్లో ఉన్న మొత్తంతో పోలిస్తే అయిదారు రోజుల వ్యవధిలోనే అంతకంటే ఎక్కువ మొత్తం జమ అయినట్లు సమాచారం. రోజుకు సగటున రూ. 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు డిపాజిట్లు వస్తున్నాయి. రద్దు అయిన పెద్దనోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని(ఎక్చేంజ్) కేంద్రం ప్రకటించింది. నోట్లను మార్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు బ్యాంకుల ఎదుట క్యూ కడుతున్నా...ఇప్పటి వరకు కేవలం రూ. 60 కోట్లు విలువ నోట్ల మార్పిడి జరిగింది.
చిల్లర కష్టాలు
రూ. వందనోట్ల కొరత ఎప్పటికి తీరుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లా అవసరాలకు రోజుకు రూ. 100 కోట్ల విలువ చేసే వందనోట్లు అవసరం ఉంది. కాని మార్కెట్‌లో కేవలం రెండు, మూడు కోట్ల విలువ చేసే వందనోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నగదు కొరత తీవ్రమైంది. అన్ని వర్గాల వారికి వందనోట్లు ప్రాణాధారం కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. రిజర్వుబ్యాంకు రూ.500 నోట్లు ముద్రించినప్పటికి జిల్లాకు చేరలేదు. జిల్లాకు రావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వంద, 500 నోట్లు పూర్తిగా మార్కెట్‌లోకి వస్తేనే నగదు కొరత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రూ. 50నోట్ల కొరత కూడ ఎక్కువగానే ఉంది.
బ్యాంకులకు తగ్గని జనాలు....
బ్యాంకులకు జనాల రద్దీ తగ్గడం లేదు. జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా 445 బ్రాంచీలు ఉన్నాయి. డిపాజిట్లు, నోట్ల మార్పిడి, విత్‌డ్రా కోసం అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు. సగటును ప్రతి బ్యాంకుకు రోజుకు 800 నుంచి 1000 మంది వరకు వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకారం రోజుకు బ్యాంకులకు 4 లక్షలకు పైగా మంది వస్తున్నట్లు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందున్న పరిస్థితితో పోలిస్తే బ్యాంకులకు ప్రజల తాకిడి ఏడెనిమిది రెట్లు పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రజలు అన్ని పనులు వదులు కొని నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. నోట్లు లభ్యం కాక వెనుదిరుగుతున్న వారు 40 శాతం వరకు ఉంటున్నారు.
ఆచరణలోకి రాని మజ్జిగ పంపిణీ
బ్యాంకుల వద్ద క్యూలో గంటల తరబడి నిల్చునే వారికి మంగళవారం నుంచి మజ్జిగ పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. బుధవారం నుంచి అమలులోకి తీసుకవచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులకు వచ్చే వారికి విజయడెయిరీ మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తుండగా ప్రభుత్వం డెయిరీకి రూ.3 ప్రకారం చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 250 ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో 400 ప్యాకెట్ల ప్రకారం అన్ని బ్రాంచిల్లో పంపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
Advertisement