ధనలోపం.. జనక్రోధం..
-
కష్టార్జితం చేతికి రాక కన్నెర్ర
-
బ్యాంకుల వద్ద నిరసన కీలలు
అమలాపురం టౌ¯ŒS :
బ్యాంకుల్లో ఇప్పుడు కరెన్సీ నోట్ల రెపరెపల కన్నా.. కడుపు మండిన వారి నోటి వెంట ఆక్రోశపు మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. తాము దాచుకున్న డబ్బులను అవసరాలకు తీసుకునేందుకు లేకపోవడంతో బ్యాంకులు ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో, తహసీల్దార్, పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యలతో బ్యాంకుల ముందే ధర్నాలు చేసే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. నగదు కోసం పడిగాపులు పడుతున్న వారు బ్యాంక్ అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు.
వేచి, వేచి, విసిగి, వేసారి..
జిల్లాలో గత 40 రోజులుగా నగదు బాధలను ప్రజలను ఎదుర్కొంటున్నప్పటికీ గత రెండు వారాలుగా బ్యాంకుల ముందు నగ దు కోసం పడిగాపులు, నో క్యాష్ బోర్డులు, పగలంతా బ్యాంకుల వద్దే సమయం కేటాయింపు వంటి సమస్యలతో విసిగి వేసారిన జనం అక్కడే నిరసన బాట పడుతున్నారు. జిల్లాలో గురువారం పలు చోట్ల బ్యాంకుల ముందు జరిగిన ధర్నాలే ఇందుకు సాక్ష్యం. పది రోజుల కిందట ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో ప్రజలు ఎస్‌బీఐ శాఖ అద్దాలు పగలగొట్టారు. బ్యాంక్‌ను ముట్టడించి బైఠాయించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక ఆంధ్రా బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఇలా జిల్లాలో ప్రతి రోజూ పలు బ్యాంకులు జనాగ్రహాన్ని ఎదుర్కోక తప్పటం లేదు. ఒక్క గురువారం రోజే రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం మండలం జేగురుపాడు, కొత్తపేట మండలం అవిడి బ్యాంకుల వద్ద నిరసలు, ఆందోళనలు జరిగాయి. జేగురుపాడు కెనరా బ్యాంక్ ఎదుట ప్రజలు వంటా వార్పు ఏర్పాటు చేసి రోజంతా తామంతా బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నా నగదు ఉండటంలేదన్న నిరసనను వినూత్నంగా చాటారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనతో బ్యాంకు అధికారులు దిగివచ్చి సమస్యను కొంతలో కొంత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కొత్తపేట మండలం అవిడి ఎస్‌బీఐపై రైతులు కన్నెర్ర చేశారు. ముందు రోజు 150 మంది రైతులకు నగదు విత్‌డ్రాకు టోకెన్లు ఇచ్చారు. తీరా బ్యాంక్‌కు వస్తే నో క్యాష్ బోర్డులు చూసి రైతులు కదం తొక్కారు. ధర్నాతో బ్యాంకు దద్దరిల్లేలా చేశారు. చివరకు తహసీల్దార్ రంగ ప్రవేశంలో సమస్య కొంత సద్దుమణిగింది. ఇక కాకినాడ సాంబమూర్తినగర్‌లోని ఎస్‌బీఐ వద్ద, రాజమహేంద్రవరం ఎస్‌బీఐ మెయి¯ŒS బ్రాంచి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు కూడా పరాకాష్టకు చేరుకున్న ప్రజాగ్రహానికి అద్దం పట్టాయి. జిల్లాలో బ్యాంకుల వద్ద మొదలైన ఈ జనాగ్రహం ఇలానే కొనసాగితే పరిస్థితి పెడదోవ పట్టే అవకాశం ఉంది. బ్యాంకులపై దాడి చేసే పరిస్థితి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంక్‌ల అధికారులు çస్పందిస్తేనే ఈ ధర్నాలు, నిరసనలకు తెర పడే అవకాశం ఉంటుంది.