పరిశ్రమలకు అనువైన భూములు గుర్తించండి
-
జేసీ ఇంతియాజ్
నెల్లూరు(పొగతోట): పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు ఉన్న భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం భూములు కేటాయిస్తామని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించి క్లియరెన్స్ తీసుకోవడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు విద్యుత్, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలకు సంబంధించి సబ్సిడీ మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిశ్రమల జీఎం ప్రదీప్‌కుమార్, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, ఎఫ్‌సీఐ మేనేజర్ గఫూర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వనజాక్షి తదితర అధికారులు పాల్గొన్నారు.