గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
కళ్యాణదుర్గం: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో బుధవారం గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. హజీజ్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఉదయం 10 గంటల సమయంలో దుకాణ నిర్వాహకుడు గ్యాస్‌స్టౌలు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
గ్యాస్‌లైట్లు, చిన్న గ్యాస్ స్టౌవ్‌లకు వినియోగించే చిన్న సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో హజీజ్, అతని భార్య, కుమార్తెలు అక్కడి నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ క్రమంలో హజీజ్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఉన్నఫలంగా భారీగా పేలుడు శబ్ధం వచ్చి మంటలు ఎగిసి పడడంతో ఇరుగు పొరుగు వ్యాపారులు, నివాసమున్న కుటుంబాల వారు పరుగులు తీశారు.
రూ.15 లక్షలకు పైగా ఆస్తి నష్టం
హజీజ్ ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో గ్యాస్‌లైట్లు, గ్యాస్‌స్టౌవ్‌లు, బ్యాటరీలు, కుక్కర్లు, మిక్సీలు, జార్లు అన్నీ కాలిబూడిదయ్యాయి. దీంతో బాధితునికి రూ.15 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మంటలు ఆర్పేందుకు శ్రమించిన ఫైర్ సిబ్బంది
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఒకే అగ్ని మాపక వాహనంతో మంటలు ఆర్పేందుకు సాధ్యపడకపోవడంతో రాయదుర్గం అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రమించారు. భవనానికి సంబంధించిన పక్క గోడలు ధ్వంసం చేసి మంటలార్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రమాద సంఘటనను తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, తహశీల్దార్ రవీంద్ర మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆర్డీఓ రామారావు కూడా సంఘటనా స్థలాని చేరుకుని పర్యవేక్షించారు.