అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీ.రమేష్
– ఇద్దరు కార్మికులకు గాయాలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ తయారీ పోటులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోటు కార్మికులు గాయపడ్డారు. శ్రీవారి ఆలయంలోని పోటులో లడ్డూల తయారీతో పాటు వివిధ రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. బుధవారం సాయంత్రం కెజీ.రమేష్, వరద అనే కార్మికులు వడలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వడలను వేడివేడి నెయ్యిలో వేస్తున్న సమయంలో నెయ్యి ఎగిసి కింద ఉన్న మంటపై పడింది. దీంతో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కేజీ రమేష్ తప్పించుకునేందుకు వెనక్కి తిరిగాడు. దీంతో అతని వీపు బాగా కాలింది. పక్కనే ఉన్న మరో కార్మికుడు వరద కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వారిని హుటాహుటిని స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఆలయ అధికారులు గాయపడిన వారిని పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అదృష్టవసాత్తు మంటలు అదుపుకావడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది.