బాణసంచా కేంద్రాలపై దాడులు
బాణసంచా కేంద్రాలపై దాడులు
Published Mon, Aug 22 2016 11:58 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
మాకవరపాలెం: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాణసంచా కేంద్రాలపై దాడులు నిర్వహించి 24 మందిని అరెస్టు చేశామని రూరల్ జిల్లా ఎస్సీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి మండలంలో ఉన్న క్రైమ్ రేటు, శాంతి భద్రతల విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల దేవరాపల్లి మండలంలో బాణసంచా కేంద్రంలో పేలుడు అనంతరం ఆయా కేంద్రాలపై దాడులకు ఎన్‌ఫోర్స్‌మెంట్æరైడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు బాణసంచా కేంద్రాలకు సంబంధించి 16 బైండోవర్ కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేశామని వివరించారు. అలాగే పేలుడు పదార్థాలు కలిగి ఉన్న 10 మందిని అరెస్టు చేసి 6 కేసులు నమోదు చేయడంతోపాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అనుమతులు లేకుండా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన lచర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు ఉన్న కేంద్రాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. పుష్కరాల విధులకు అధిక సిబ్బందిని పంపడంతో జిల్లాలో చిన్నచిన్న నేరాలు జరిగాయని, గంజాయి రవాణాకు ఎక్కువగా ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ నెల 26 నుంచి సిబ్బంది అందుబాటులోకి వస్తారని, నేరాలు, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకు సిబ్బంది, జ్యూయలరీ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై కూడా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 600 కానిస్టేబుల్ పోస్టులు కాళీగా ఉన్నాయని, త్వరలో రాష్ట్రంలో 4560 కొత్తగా తీసుకోనున్నందున ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి సమస్యలనైనా తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ ద్వారా 35 ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నిటినీ పరిష్కరించామన్నారు. ఆయన వెంట నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ పి.రమేష్, ట్రైనీ ఎస్‌ఐ ఉమావెంకటేశ్వరరావు ఉన్నారు.
Advertisement
Advertisement