రైల్వే స్టేషన్‌లో కాల్పుల కలకలం
- సెవన్‌హిల్స్ రైలులో దుండగలు ఉన్నట్లు సమాచారం
- అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు
- గార్లదిన్నె రైల్వే స్టేషన్‌కు రైలు రాగానే గాలింపు
- దుండగుల ఆచూకీ దొరక్కపోవడంతో గాలిలోకి కాల్పులు
గార్లదిన్నె : అది గార్లదిన్నె రైల్వే స్టేషన్. శనివారం తెల్లవారుజామున తిరుపతి నుంచి గుంతకల్లుకు బయలుదేరి వచ్చిన ఓ రైలు అప్పుడప్పుడే వచ్చి ఆగింది. రైల్లోని ప్రయాణికులందరూ నిద్రలోనే ఉన్నారు. రైలు వచ్చి ఆగగానే పోలీసులు కొందరు రైలు బోగీల్లోకి ఎక్కి హంగామా చేశారు. అంతలోనే కాల్పుల శబ్దం రావడంతో రైల్లోని ప్రయాణికులతో పాటు స్టేషన్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. కొందరు భయంతో వణికిపోయారు. మరికొందరు పరుగులు పెట్టారు.
జరిగిందేమిటంటే...
తిరుపతి నుంచి గుంతకల్లుకు బయలుదేరి వచ్చిన రైలు గార్లదిన్నె స్టేషన్‌కు రాగానే పోలీసులు చుట్టుముట్టారు. రైల్లో దుండగులు ఉన్నారన్న సమాచారంతో వారు అప్రమత్తమయ్యారు. కొందరు మఫ్టీలో, మరికొందరు డ్రెస్సుల్లోనే ఉన్నారు. బోగీలన్నీ వెతికినా వారికి దుండగుల జాడ కానరాలేదు. చేసేది లేక గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలానికి కారణమైంది.
గుంతకల్లు డీఎస్పీ ఆరా
ఘటన సమాచారం తెలుసుకున్న గుంతకల్లు రైల్వే శాఖ డీఎస్పీ పీఎన్ బాబు, సీఐ జగదీశ్ నాయక్ తమ సిబ్బందితో గార్లదిన్నె రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం చేరుకున్నారు. ఏం జరిగిందనే అంశంపై ఆరా తీశారు.