చెరువులకు చేపపిల్లల విత్తనాలు అందిస్తాం
బీర్కూర్ : జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని 531 చెరువులకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై చేపపిల్లల విత్తనాలు సరఫరా చేస్తోందని మత్స్య పరిశ్రమశాఖ సహకార సంస్థ జిల్లా చైర్మన్ సాయిబాబా తెలిపారు. సోమవారం ఆయన బీర్కూర్‌లో విలేకరులతో మాట్లాడారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మత్స్యకార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. విత్తనాలకోసం సుమారు రూ. 48 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మరో 2,265 చెరువులు పంచాయితీల పరిధిలో ఉన్నాయని, వాటిని కూడా మత్స్యశాఖకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్ససాయిలు, గంగారాం, బాబబోయి తదితరులు పాల్గొన్నారు.