వలకు చిక్కని చేప
వలకు చిక్కని చేప
Published Thu, Aug 24 2017 10:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM
సముద్రంలో తగ్గిన వేట
సగం బోట్లకు లంగరు
సీజన్‌లో తగ్గిన ఫిషింగ్
ఖాళీగా మత్స్యకారులు
నరసాపురం:
సముద్రంలో చేపలు ఎక్కువగా దొరికే సీజన్ ఇది. చేపలు ఆశించిన స్థాయిలో వలలకు చిక్కడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లభించడంతో మత్స్యకారులు ఏ ఇబ్బందీ ఉండదు. తుఫాన్‌లు ఏర్పడితే కాస్త ఇబ్బంది, లేదంటే వేట ముమ్మరంగా సాగుతుంది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. గత రెండు నెలలుగా సముద్రంలో ముమ్మరంగా వేట సాగించిన మత్స్యకారులు ప్రస్తుతం మత్స్యసంపద నామమాత్రంగా ఉండడంతో ఒక్కసారిగా ఖాళీ అయ్యారు. వేటబోట్లకు లంగరు పడింది.
వేట కాలం
ఏటా ఏప్రియల్ 15 నుంచి జూన్ 15 వరకూ చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధం ఎత్తేసిన తర్వాత జూన్ నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటను ముమ్మరంగా నిర్వహిస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకూ సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఏ ఇబ్బందీ లేకుండా ఉల్లాసంగా గడుపుతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చేసరికి వేటబోట్లకు సరుకు దొరకడం గగనమవుతుంది. అయితే ప్రస్తుతం చేపలు దొరకడం కష్టంగా ఉందని మత్స్యకారులు చెప్తున్నారు.
నిరాశ
ప్రస్తుతం వేట అంతంత మాత్రంగా సాగడంతో లాకులు వద్దనున్న వశిష్టా గోదావరి పాయవద్ద చాలా బోట్లను నిలిపేశారు. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకూ బోట్లు నరసాపురం తీరంలో నిత్యం వేట సాగిస్తాయి. ప్రస్తుతం 30 వరకూ బోట్లు మాత్రమే వేటసాగిస్తున్నట్టు మత్స్యకారులు చెప్తున్నారు. పూర్తిస్థాయిలో వేట సాగకపోవడంతో మత్స్యకారులు నరసాపురం గోదావరి ఏటిగట్టు పొడవునా పలుచోట్ల వలలు బాగు చేసుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో మత్స్యకారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నిషేధ సమయంలో కూడా సముద్రంలో చాటుమాటుగా కొందరు వేట కొనసాగించడంతో చేపల గుడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గిపోయి దాని ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోందని పలువురు మత్స్యకారులు చెపుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో కొన్ని రోజులపాటు ఇటువంటి పరిస్థితులు షరా మామూలేనని, మళ్లీ పరిస్థితి యధాస్థితికి వస్తుందని మత్స్యశాఖ అధికారులు చెపుతున్నారు.
ఖాళీగా ఉంటున్నాం
మల్లాడి సాయిబాబా, బోటు కార్మికుడు
వేట గత కొన్ని రోజులుగా సరిగా జరగడంలేదు. మా బోటు వారం క్రితం బయటకు వచ్చింది. మళ్లీ వేటకు వెళ్లలేదు. వారం రోజులుగా ఖాళీగానే ఉంటున్నాము. వేట లేకపోవడంతో పైసా ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడేలేదు. ఏం చేయాలో తెలియడంలేదు.
గడ్డు పరిస్థితి
పీతల ప్రసాద్, బోటు యజమాని, నరసాపురం
బోట్లను వేటకు పంపినా పెద్దగా చేపలు పడటంలేదు. దీంతో పెద్దగా సొమ్ములు రావడంలేదు. ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఐస్, డీజిల్ రేట్లు పెరిగాయి. సరుకు పెద్దగా పడకపోతే నష్టాలు వస్తున్నాయి. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాము.
Advertisement