
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
– వీరిలో ప్రతిభా అవార్డు గ్రహీత విద్యార్థికి తీవ్రగాయాలు
– తీవ్రంగా దెబ్బతిన్న ఇన్నోవా, ట్రాక్టర్
కడప అర్బన్ : కడప నగరం మరియాపురం సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ట్రాక్టర్, ఇన్నోవాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈప్రమాదంలో ప్రతిభా అవార్డు గ్రహీత తేజ (16) తీవ్రంగా గాయపడ్డాడు. తేజ బంధువులు ముగ్గురు, ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డవారిని రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయచోటి మాసాపేట గొల్లపల్లెకు చెందిన తేజ (16) గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో అతనికి ప్రతిభా అవార్డు దక్కింది. రెండు రోజుల క్రితం విజయవాడకు తన బంధువులతో కలిసి వెళ్లాడు. గత రాత్రి విజయవాడలో కార్యక్రమం ముగించుకుని తిరిగి రాయచోటికి శనివారం రాత్రి 7:30 గంటలకు ఇన్నోవా వాహనంలో బయలుదేరాడు. రాత్రి ఒంగోలులో రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కడప మీదుగా రాయచోటికి బయలు దేరారు. కడప మరియాపురం పెట్రోల్ బంక్ దగ్గరికి ఆదివారం తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో రాగానే, అపుడే పెట్రోల్ బంక్‌లో నుంచి బాలాజీనగర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాముడు తన వాహనంతో వేగంగా రావడం, అదే సమయంలో ఇన్నోవా వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డ తేజ, శ్రీనివాసులు, మోహన్‌రాజు, ప్రకాష్ , ట్రాక్టర్ డ్రైవర్ రాముడులను రిమ్స్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.