ఇంతలోనే అంత విషాదమా !
రోడ్డు ప్రమాదంలో ‘ఉస్మానియా’ మెడికోల దుర్మరణం
కిమ్స్ మెడికల్ కళాశాలలో విషాదం
ఘన నివాళి అర్పించిన వైద్య విద్యార్థులు,
వ్యాయామోపాధ్యాయులు
విజయవాడ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదం అమలాపురం కిమ్స్ కళాశాల వైద్య విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైద్య, దంతవైద్య కళాశాలల విద్యార్థులకు.. కిమ్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ క్రీడా పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొని, తిరుగు పయనమైన హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బస్సు.. విజయవాడ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముందు రోజు వరకూ తమతో కలసి ఉత్సాహంగా ఆటలాడిన ‘ఉస్మానియా’ వైద్య విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారని.. వారిలో నలుగురు అసువులు బాశారని తెలిసి.. కిమ్స్ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుల కుటుంబాలకు కళాశాల యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది.
అమలాపురం/ అమలాపురం రూరల్ : ఐదారు రోజుల పాటు కళ్ల ముందు ఉత్సాహంగా ఆటలాడిన సహచర విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం వైద్య విద్యార్థుల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మెడికోలు సొంత ఇళ్లకు సంతోషంగా బయలుదేరిన రోజునే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని కిమ్స్ యాజమాన్యం, వ్యాయామోపా ధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అమలాపురం కిమ్స్‌లో ఈనెల 10 నుంచి 13 వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 19వ ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్, డెంటల్ కాలేజీ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. ఆది వారం మధ్యాహ్నం ఆటలు ముగియడంతో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు కోనసీమ అందాలను తిలకించేందుకు వెళ్లారు. యానాం, ఎదుర్లంకతోపాటు పలు ప్రాంతాలను సందర్శించారు.
ఆదివారం రాత్రి బయలుదేరాల్సిన విద్యార్థులు కిమ్స్‌లోనే బసచేసి సోమవారం ఉదయం బయలుదేరారు. రాత్రి జరిగిన దుర్ఘటనలో వీరు మృత్యువాత పడ్డారని తెలిసి కిమ్స్‌లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ‘ఉస్మానియా’ విద్యార్థులు అన్ని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మృత్యువాత పడిన మేకా విజయతేజ, గిరి లక్ష్మణ్, వి.ఉదయ్, ప్రణయ్‌రాజారామ్‌లు వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నారు. బాస్కెట్‌బాల్‌లో యూనివర్సిటీ జట్టు రన్నర్‌గా నిలి చింది. కబడ్డీ పోటీల్లో ఓటమి చెందినా వీరు ఆడిన తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఇలా కళ్ల ముందు నడియాడిన తమ సహచర విద్యార్థులు మృతి చెందడంతో కిమ్స్ వైద్య విద్యార్థులు కలత చెందారు.
విద్యార్థుల మృతికి కిమ్స్ యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది. కిమ్స్‌లో మంగళవారం డీన్ ఏఎస్ రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సంతాపసభలో వైద్య విద్యార్థులు నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్, డాక్టర్ ఆనందాచార్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్‌రాజు, సీఏవో రఘులు సంతాపం తెలిపిన వారి లో ఉన్నారు. క్రీడా పోటీల్లో అంపేర్లుగా సేవలందించిన వ్యాయామోపాధ్యాయు లు ఈ సంఘటన పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఈటీలు పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబా బు), వాసంశెట్టి హరిబాబు, గోలకోటి నారాయణరావు, ఉండ్రు ముసలయ్య, కె.నాగరాజు, ఐ.భీమేష్, పి.విఘ్నేశ్వరుడు, కె.సత్యనారాయణ, కె.ఆదిలక్ష్మి, వి.నరసింహారావు, ఎంజీ రామారావు, సత్యానందం, కె.వెంకటేశ్వరరావు, వై.ఎస్.వి.రమణారావు తదితరులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.