‘కస్తూర్బా’ నుంచి ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్
♦ టీసీ ఇచ్చి పంపించేసిన అధికారులు
♦ విచారణ చేపట్టిన జీసీడీవో శకుంతల
ఎడపల్లి : ఎడపల్లి శివారులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆరో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు ఈ నెల 17న రాత్రి అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, అటుగా వచ్చిన కారు డ్రైవర్ వారిని గమనించి స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కాస్తుర్బా పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారమివ్వగా, ఆమె వచ్చి విద్యార్థినులను పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారం డీఈవోకు తెలియడంతో విచారణ జరపాలని బాలికల సంరక్షణ అధికారి (జీసీడీవో) శకుంతలను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆమె గురువారం కస్తూర్బా పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థినులు బయటకు పోతున్నా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న వార్డెన్‌ను ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ మీరాబాయి, నైట్ వాచమన్ మహేరాబేగం, హెచ్‌ఎం కాయకాసంలను విచారించారు. ఇంత జరిగినా అధికారులకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముదం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీ ఇచ్చి పంపించేశారు.