పక్కా స్కెచ్‌! | fixed deposits missing on pre planned | Sakshi
Sakshi News home page

పక్కా స్కెచ్‌!

Published Fri, Jun 16 2017 10:22 PM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

పక్కా స్కెచ్‌! - Sakshi

పక్కా స్కెచ్‌!

– ఫిక్స్డ్‌ డిపాజిట్‌ బాండ్ల మాయంపై విచారణ
– బ్యాంక్‌ అధికారులు, చిట్‌ నిర్వాహకుడి కుమ్మక్కు!
–  ఫోర్జరీ సంతకంతో నగదుగా మార్చుకున్న వైనం
– చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌పై శాఖాపర చర్యలు?
–  ఘటనపై వివరాలు సేకరించిన రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ  


అనంతపురం టౌన్‌ : జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.20 లక్షలు విలువైన ఫిక్స్డ్‌ డిపాజిట్‌ బాండ్ల చోరీ వెనుక పక్కా స్కెచ్‌ ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిట్‌ నిర్వాహకుడు, బ్యాంక్‌ అధికారులు కుమ్మక్కు కావడంతో పని సులువైందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ అబ్రహాం పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా.. అధికారుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సూపరింటెండెంట్‌ నాగభూషణంతో కలిసి ఆయన రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. బాండ్లు ఎలా మాయమయ్యాయో అడిగి తెలుసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న శివకామేశ్వరి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను బండి నాగరాజు నిర్వహిస్తున్నాడు. నిబంధనల ప్రకారం కొత్తగా చిట్‌ ప్రారంభిస్తే దాని విలువ మొత్తాన్ని ఏదైనా బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి సంబంధిత బాండ్లను రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఉంచాలి. ఈ విధంగా బండి నాగరాజు 2012లో రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, 2014లో రూ.5 లక్షల విలువైన బాండ్లను అశోక్‌నగర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకుని అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉంచాడు. దీని కార్యకలాపాలను చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సి.కుమారస్వామిరెడ్డి చూస్తున్నారు. ఈ నెల 9న సాయంత్రం మూడు బాండ్లు బీరువాలో లేని విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా బండి నాగరాజు వాటిని నగదుగా మార్చుకున్నట్లు తెలిపారు. దీంతో అతడే ఫోర్జరీ సంతకం చేసి బాండ్లను అపహరించినట్లు నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ తర్వాత నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కుమారస్వామిరెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ ఆంజనేయులునాయక్‌కు రిపోర్ట్‌ ఇచ్చారు. ఆయన రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ అబ్రహాంకు నివేదికను పంపగా శుక్రవారం జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో విచారణ జరిగింది.

బ్యాంక్‌ అధికారులే కీలకం
బాండ్లు నగదుగా మార్చే విషయంలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బాండ్ల గడువు ముగియకముందు వాటిని నగదుగా మార్చుకునేందుకు వీలుండదు. ఒక వేళ అలా మార్చాల్సి వస్తే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను సంప్రదించారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పైగా ఫోర్జరీ సంతకంతో తీసుకెళ్లిన బాండ్లను ఎలాంటి ఆలోచన చేయకుండా నగదుగా మార్చిచ్చేశారు. ఈ విషయాన్ని చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కుమారస్వామిరెడ్డి ఉన్నతాధికారులకు పంపిన నివేదికతో పాటు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బండి నాగరాజు సదరు బ్యాంక్‌లో రుణం తీసుకుని ఈఎంఐ కట్టలేదని తెలుస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో పక్కా ప్లాన్‌తోనే బాండ్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇందులో బ్యాంక్‌కు సంబంధించిన ఓ కీలక ఉద్యోగి పాత్ర ఉన్నట్లు రిజిస్ట్రేషన్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత వారు బండి నాగరాజు ఇంట్లో సోదాలు చేయగా ఈ బాండ్లకు సంబంధించి కలర్‌ జిరాక్స్‌ ప్రతులు బయటపడ్డాయి. ఒరిజినల్‌ బాండ్లను తస్కరించిన నాగరాజు మరోసారి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి కలర్‌ జిరాక్స్‌ బాండ్లను అదే బీరువాలో ఉంచాలని ప్రణాళిక రచించినట్లు స్పష్టమవుతోంది.  

చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు
బాండ్లు చోరీకి గురైన ఘటనను డీఐజీ అబ్రహాం తీవ్రంగా పరిగణించారు. మొత్తం నివేదికను ఆ శాఖ ఐజీకి పంపనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుమారస్వామిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement