ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలి
-
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
వచ్చే నెల 28 నుంచి నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షులపండగ)ను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పక్షుల పండగకు నిర్దేశించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫెస్టివల్‌కు వచ్చే వారు ఇబ్బందులుపడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తడ నుంచి బీవీపాళెం, డీవీసత్రం, వేదురపాళెం, నరసాంబాపురం వరకు రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఈ మరమ్మతులకు జిల్లా ఖజిన సంపద నిధులను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్‌జీఓలు సమన్వయంతో పని చేసి ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమవేశంలో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పర్యటక శాఖ ఈడీ చంద్రమౌళి పాల్గొన్నారు.