-
జిల్లాలో గడచిన 24 గంటల్లో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు
-
అత్యధికంగా ఐ పోలవరంల 16 సెం.మీ. వర్షపాతం
-
కాకినాడ, ముమ్మడివరం, తాళ్లరేవు, అమలాపురం, కాట్రేనికోనల్లో 10 సెం.మీ
-
రాజానగరంలో చెరువుకు గండి, జాతీయరహదారిపై నీళ్ల పరవళ్లు
-
నిలిచిన వాహనాలు, ప్రయాణికులు, విద్యార్థులు అష్టకష్టాలు
-
3000 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. బుధవారం మొదలైన వర్షాలు గురువారం రెండో రోజు కూడా జిల్లా అంతటా కురిశాయి. ఈ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జిల్లా కేంద్రం కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కాలనీల చుట్టూ వర్షపు నీరు చేరడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నాయి.
.
జాతీయ రహదారిపై పరవళ్లు ... ఐ.పోలవరంలో 16 సెం.మీ. వర్షపాతం
రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాజమహేంద్రవరం – విశాఖపట్నం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గడచిన 24 గంటల్లో జిల్లాలో 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఐ.పోలవరం మండలం లో 169.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఎటపాక మండలంలో 6.4 మిల్లీమీటర్లు నమోదైంది. కాకినాడ, ముమ్మిడివరం, తాళ్లరేవు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లు దాటి వర్షపాతం నమోదైంది.
.
రంపవద్ద రాకపోకలకు అంతరాయం...
రంపచోడవరం ఏజెన్సీలోని సీతపల్లివాగు దండంగి వద్ద ఉధృతంగా పొంగి ప్రవహిస్తూ దేవీపట్నం–ఇందుకూరి పేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పందిరిమామిడి–బందపల్లి మధ్య తాటివాడ వాగు పొంగి ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమహేంద్రవరం నగరాల్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. రాజమహేంద్రవరం బృహన్నలపేటలోకి వర్షం నీరుచేరింది. ఆర్యాపురం, తుమ్మలోవ, కంబాలచెర్వు, కృష్ణానగర్, కాకినాడ ముత్తానగర్, దుమ్ములపేట, మహలక్ష్మినగర్, పర్లోపేట, రావులపాలెం ప్రియదర్శినినగర్, ఇందిరాకాలనీ, కొత్తకాలనీలు ముంపునీరు చేరింది.
.
మూడు వేల ఎకరాల్లో పంటకు నష్టం...
కొత్తపేట నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా పసుపు, కంద, అరటి, పువ్వులు, బొప్పాయి తదితర ఉద్యాన వన పంటలు వర్షాలకు నేలనంటేశాయి. సుమారు 3000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ముంపు బారిన పడ్డాయి. గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్దంగా మారాయి. డ్రైన్స్ పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్ద సక్రమంగా లేకపోవడం వల్లన శివారు కాలనీలు బు«రదమయంగా మారాయి. సామర్లకోట మండలం జి.మేడపాడు మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల, సామర్లకోట కూరగాయల మార్కెట్‌లోని నీలమ్మ చెరువుగట్టు రోడ్డు ముంపునకు గురైంది. పి.బి.దేవం గ్రామంలో రోడ్లు జలమయమ్యాయి. పెద్దాపురం–జగ్గంపేట రోడ్డు నీట మునిగింది. పిఠాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలతో ఏలేరు కాలువలు, పెదయేరు, గొర్రిఖండి పొంగిపొర్లుతున్నాయి.
.
+ ఉప్పాడ కొత్తపల్లి మండల తీరప్రాంతంలో చేపలవేట నిలిపివేశారు. రంగంపేట మండలంలో చెరువులు నిండిపోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జి.దొంతమూరు గ్రామం ముంపునకు గురైంది. కాకినాడరూరల్ తూరంగి, వాకలపూడి, సూర్యారావుపేట, కొవ్వూరు, రమణయ్యపేట, తిమ్మాపురంలో పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.
+ కరప మండలం గొర్రిపూడిలో 300 కుటుంబాల వారు నివాసముంటున్న ఇందిర కాలనీ ముంపునకు గురైంది. తుని నియోజకవర్గంలో 300 ఎకరాల్లో ప్రత్తిపంట నీట మునిగింది.మరో రెండు మూడు రోజులు వర్షాలు ఇలానే ఉంటే ప్రత్తిపంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందున్నారు. సుమారు 100 ఎకరాల్లో కాయకూరల తోటల్లో వర్షపు నీరు నిలిచిపోయి రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎగువున కొండలపై నుంచి వస్తున్న వర్షం నీటితో తుని పట్టణంలో పలు రోడ్లు, కాలనీలు జలమయయ్యాయి. పంపా, తాండవ రిజర్వాయర్లుతోపాటు, చెరువులు పూర్తిగా నిండాయి, తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మాగుడు, కాండంకుళ్ళు, ఉల్లికోడి తదితర తెగుళ్ళు ఖరీఫ్ పంటను ఆశించి ఉన్నాయి. ప్రస్తుత వర్షంతో తెగుళ్ళ బెడద ఎక్కువ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే తెగుళ్ళు ఉధృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ప్రమాదరకరంగా చెరువు గట్లు...
మెట్ట ప్రాంతంలో చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏలేరు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 24.11 టీఎంసీల సామార్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.77 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. సుబ్బారెడ్డి సాగర్, పంపా, తాండవ ప్రాజెక్టులలోకి వర్షపునీరు చేరింది. చెరువులు పొంగి పొర్లుతుండటంతో దిగువ ప్రాంతాల్లో ఆయకట్టు రైతులు, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.జగ్గంపేట సమీపాన ఉన్న జగ్గమ్మ చెరువు నుంచి వర్షపునీరు పోయే వాలుకాలువ ఆక్రమణలో ఉండడంతో వర్షం పడితే చెరువుకు ఏ క్షణాన్నైనా గండిపడే ప్రమాదం ఉందని జగ్గంపేటవాసులు భయపడుతున్నారు. మెట్టలోని పత్తి, అపరాల పొలాల్లో వర్షంనీరు మరో 24 గంటలు నిల్వ ఉంటే పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన నెలకొంది.గొల్లప్రోలు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30వేల ఎకరాల్లో పత్తి, రంపచోడవరం ఏజెన్సీతో పాటు తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 25 వేలు ఎకరాల్లో అపరాల పంటలపై వర్షం ప్రభావం పడింది. గొల్లప్రోలు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30వేల ఎకరాల్లో పత్తి, తుని, ఏజెన్సీ, జగ్గంపేట ప్రాంతాల్లో 25 వేలు ఎకరాల్లో అపరాలు ముంపులో ఉన్నాయి. మరో రెండు రోజులు ఇలానే వర్షాలు కురిసి నీటి నిల్వ ఉంటే పత్తి దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.