వరద బీభత్సం
వరద బీభత్సం
Published Fri, Sep 23 2016 4:59 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
* జిల్లా అతలాకుతలం
* భారీ వర్షాలకు ఏడుగురు మృతి.. ఒకరి గల్లంతు
* వరద ఉధృతికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌లు
* గుంటూరు– సికింద్రాబాద్ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు
* జల దిగ్బంధంలో పలు గ్రామాలు
* స్తంభించిన రవాణా వ్యవస్థ
* నకరికల్లులో అత్యధికంగా 24.14 సెంటీమీటర్ల వర్షపాతం
భారీ వర్షాలు మరోసారి జిల్లాను వణికించాయి. వాగులు పొంగిపొర్లడంతో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఏడుగురి నిండు ప్రాణాలు బలిగొంది. మరొకరు వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వరద నీటి ఉధృతికి కట్టలు తెగిపోయాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో ఊళ్లు ఏరులయ్యాయి. రైలు, రోడ్డు మార్గాల్లోనూ రాకపోకలు స్తంభించాయి. ఒక్కసారిగా జనజీవనం అతలాకుతలమైంది.
సాక్షి, గుంటూరు: జిల్లాలో వర్ష బీభత్సానికి ప్రజలు విలవిలలాడి పోయారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురవడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వాగులు, చెరువులు ఉధతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు, కల్వర్టులు, చప్టాలు కొట్టుకు పోయి రాకపోకలు స్థంభించి పోయాయి. జిల్లాలోని నకరికల్లు మండలంలో అత్యధికంగా 24.14 సెం.మీ, అత్యల్పంగా రెంటచింతలలో 1.12 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నరసరావుపేట, మాచవరం, ముప్పాళ్ళ, ఫిరంగిపురం మండలాల్లో 20 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో ఈప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. వరద నీరు గ్రామాల్లోకి చేరడంతో పలు గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయి. ముఖ్యంగా జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపట, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వరద బీభత్సానికి జన జీవనం స్థంభించి పోయింది.
ఇళ్ళల్లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నరసరావుపేట పట్టణంలోని ఖత్వా చెరువు పొంగి పొర్లడంతో స్టేడియం వద్ద ఆర్టీసీ, ప్రై వేటు బస్సులు రెండు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ప్రయాణిస్తున్న 50 మంది భయంతో కేకలు వేశారు. దీంతో స్పందించిన స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణీకులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఇదే మండలం బసికాపురం వద్ద సైతం బస్సుల్లో 15 మంది ప్రయాణీకులు వరద నీటిలో చిక్కుకుపోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వారిని రక్షించారు. జొన్నలగడ్డ వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పక్కనే ఉన్న మట్టి రోడ్లు కొట్టుకు పోయాయి. దీంతో గుంటూరు– కర్నూలుకు రాకపోకలు స్తంభించి పోయాయి. సత్తెనపల్లి పట్టణంలో చప్టా వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వైపుకు రాకపోకలు నిలిచిపోయాయి. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకు రాకపోకలు స్థంభించాయి.
నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని అనేక కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోయి ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్ళదీశారు. పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు వద్ద కారు ఎద్దువాగులో చిక్కుకుపోయింది. అందులో ఉన్న ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటకు చేర్చారు. క్రోసూరు మండలం విప్పర్ల, ఊటుకూరు మధ్య ప్రవహిస్తున్న ఎద్దువాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయి అందులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రయాణీకులు బస్సుపైకి ఎక్కి రక్షించాలంటూ హాహా కారాలు చేశారు. వీరిని అధికారులు, స్థానికులు పడవల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
గురజాల నియోజకవర్గంలో దండివాగు, గాడిదల వాగు, ఎర్రవాగు, నల్లవాగులు పొంగిపొర్లాయి. మాచర్ల నియోజకవర్గంలో చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహించింది. మేడికొండూరు వద్ద ఉన్న రెండు చప్టాలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్థంభించాయి. ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం వద్ద కొండవాగు ప్రవహిస్తుండటంతో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రాకపోకలు స్థంభించాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా నీట మునగడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ముగ్గురు మృతి... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
జిల్లాలో వరద ఉధృతికి ముగ్గురు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి వద్ద చెరువులో పడి నలుగురు కొట్టుకు పోతుండగా, స్థానికులు ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే అదే గ్రామానికి చెందిన గోసి సింగరయ్య (40) మతిచెందాడు. సత్తెనపల్లి మండలం గోరంట్ల వద్ద ఎద్దువాగులో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు రక్షించారు. నందిగం అబ్రహం అనే వ్యక్తి వాగులో కొట్టుకు పోయి మృచెందాడు. సత్తెనపల్లి పట్టణంలోని బోయకాలనికి చెందిన ఎద్దులదొడ్డి ఆదిత్య (3) అనే బాలుడు ఇంటి ముందు డ్రెయినేజీలో పడి వరద ఉధృతికి కొట్టుకు పోయి మృతిచెందాడు.
చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కుప్పగంజి వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఎత్తిపోతల పథకానికి కాపలాగా ఉంటున్న ఈ కుటుంబంలో నలుగురు ఉండగా, ఒకరు మాత్రం తాడిచెట్టుపట్టుకుని ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతన్ని చివరకు స్థానికులు ధైర్యం చేసి రక్షించారు. అమరావతి మండలం మునుగోడు వద్ద ఎద్దు వాగులో ఆరుగురు గొర్రెల కాపరులు గల్లంతయ్యారు. వీరిని రెస్క్యూటీమ్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మొత్తం ఏడుగురు చనిపోగా ఒకరు గల్లంతయినట్లు సమాచారం.
వరద ఉధృతికి కొట్టుకు పోయిన రైల్వే ట్రాక్
రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద వరద ఉధృతికి 50 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకు పోయాయి. అదేవిధంగా అనుపాలెం వద్ద వంద మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే పలు రైళ్ళను రద్దు చేశారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం నంద్యాల మీదుగా సికింద్రాబాద్‌కు నడిపారు. అయితే రెడ్డిగూడెం, అనుపాలెంల వద్ద రైల్వే ట్రాక్ వరద ఉధతిలో కొట్టుకు పోవడానికి 15 నిమిషాల ముందు పల్నాడు ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లు ఆట్రాక్‌పై నుంచే వెళ్ళాయి. ఇవి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌రెడ్డిగూడెం, ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ కోనంకి గేటు వద్ద నిలిచిపోయాయి. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. అయితే ఫలక్‌నూమా, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ నిలిచిన ప్రాంతానికి చేరుకునేందుకు వీలు కలుగకపోవడంతో సాయంత్రం వరకు ఆహారం లేక అల్లాడి పోయారు. దీంతో స్థానికులు వారికి కొంత మేరకు భోజనం అందించారు.
స్థంభించిన రవాణా వ్యవస్థ..
జిల్లాలో వరద ఉధృతికి వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. జిల్లాలో గుంటూరు ఆర్టీసీ డిపోకు చెందిన 500 బస్సులు వరదల కారణంగా నిలిచిపోయాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాచర్ల, పిడుగురాళ్ళ, రెడ్డిగూడెం, బెల్లంకొండల నుంచి హైదరాబాద్‌కు 40 ఆర్టీసీ బస్సులను అధికంగా నడిపారు.
Advertisement