ఫ్లోరైడ్ బారి నుంచి కనిగిరి వాసులకు విముక్తి ఎప్పుడో..
♦ వాడుకకూ పనికిరాని భూగర్భ జలాలు
♦ 124 గ్రామాలకు అందని సాగర్ జలాలు
♦ ముందుకు సాగని కుడికాల్వ రెండో దశ పనులు
♦ రక్షిత మంచినీటి పథకానికి గ్రహణం
♦ రెండేళ్లుగా నిలిచిన రూ.88 కోట్ల నిధులు
♦ అమలు కాని సీఎం చంద్రబాబు హామీలు
♦ నిధుల సాధనలో నాయకుల వైఫల్యం
‘ఇక్కడి భూమిలో నీరు 40 అడుగుల లోతు దాటితే తాగేందుకు పనికిరాదు. ఫ్లోరైడ్ తీవ్రంగా ఉందని నివేదికలున్నాయి. భూగర్భ జలం తాగొద్దు.. మీకు వెలిగొండ, సాగర్ జలాలు అందిస్తా.. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తా’..
- గతేడాది శీలంవారిపల్లి సభలో కనిగిరి వాసులకు సీఎం
చంద్రబాబు ఇచ్చిన హామీ
కనిగిరి ప్రాంతంలోని భూగర్భ జలాలు తాగేందుకు కాదు కదా.. కనీసం వాడుకునేందుకు కూడా పనికిరావు. ఇక్కడ పండించిన కూరగాయలు, పండ్లు సైతం వాడరాదు. వాటిలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉంది. టూత్ పేస్ట్ సైతం ప్రత్యేకమైనది ఉండాల్సిందే.. పారుదల నీటితోనే ఫ్లోరైడ్ నుంచి విముక్తి. - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ చెప్పిన మాటలు
కనిగిరి: కనిగిరి ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. ఎటు చూసిన ఫ్లోరోసిస్ బాధితులే కనిపిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడా శాశ్వత నీటి వనరులు లేవు. ఆరు మండలాల్లోని 135 పంచాయతీల పరిధిలో ఉన్న 467 గ్రామాలకూ వర్షపు నీరు, భూగర్భజలాలే దిక్కు. ఈ ప్రాంతం నుంచి కాలువ నీరు పారాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడే కనీసం నాలుగు మండలాలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. సాగర్ కుడి కాలువ రెండో దశ పనులు చేపడితే నియోజకవర్గానికి తాగు, సాగు నీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కాలువ కురిచేడు వరకు వచ్చింది. 59 కిలో మీటర్లు కాలువను పొడిగిస్తే కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తాగు నీటితో పాటు 6 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి భూ గర్భ జలాలు తాగేందుకు కాదు కదా కనీసం వాడుకకు కూడా పనికిరావని వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నా ప్రజలకు రక్షితనీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే సొంత మండలంలోనూ అదే తీరు..
ఫ్లోరోసిస్ బాధ నుంచి కనిగిరి ప్రజలకు విముక్తి కల్గించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.175 కోట్లతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. మొదటి విడత రూ.91 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరిగి రెండోవిడత నిధులు కూడా రూ.61 కోట్లు మంజూరై పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పథకానికి గ్రహణం పట్టింది. దీంతో రెండేళ్ల నుంచి మూడో విడత నిధులు రూ.88 కోట్లు రాలేదు. ప్రస్తుతం దాని వ్యయం రూ.100 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. నిధుల సాధనకు ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యూరనే విమర్శలున్నాయి.
ఫలితంగా నియోజకవర్గంలోని 124 గ్రామాల్లో రామతీర్థం ప్రాజెక్టు నీటి సరఫరా లేదు. ఎమ్మెల్యే సొంత మండలంలో ఒక్క గ్రామానికి కూడా సాగర్ జలాలు ఇవ్వలేని దుస్థితి. ఫ్లోరైడ్ శాతం 5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 7పీపీఎం వరకు ఉందని గత ఏడాది శీలంవారి పల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సెలవిచ్చారు. వెలిగొండ, సాగర్ జలాలు అందించడం ద్వారా ఇక్కడి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తానని వాగ్దానాలు చేశారు. కనీసం రక్షిత పథకానికి మూడో విడత అందించాల్సిన రూ.88 కోట్లు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.