బాబుగారు మళ్లీ ఏసేశారు! | Chandrababu Failure To Save People And Crop From Cyclone Montha, Controversy Over Media Hype And Actual Relief Efforts | Sakshi
Sakshi News home page

బాబుగారు మళ్లీ ఏసేశారు!

Nov 4 2025 10:48 AM | Updated on Nov 4 2025 11:35 AM

Chandrababu Failure To Save People and Crop From Cyclone Montha

అదేదో సినిమాలో ఓ డైలాగుంటుంది.. ‘‘మళ్లీ ఏసేశాడు’’ అని! చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఈ డైలాగునే గుర్తుకు చేస్తున్నాయి. మోంథా తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామని ఆయన ప్రకటించారు. అంతవరకూ ఓకే కానీ.. అమెరికా కూడా ఇలంటి సంక్షోభాలను తనంత సమర్థంగా ఎదుర్కోలేదనడంతోనే వచ్చింది చిక్కు. అక్కడితో ఆగారా? ఊహూ లేదు.. పదహారు నెలల్లో తయారు చేసిన టెక్నాలజీతో తుపానును అడ్డుకున్నామని కూడా ఆయన వాకృచ్చారు. నిజానిజాలు దేవుడికెరుక అనుకున్నారేమో మరి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త, వెరైటీ పదాన్ని వెతుక్కోవడం వాటితో తనకు తాను బూస్టింగ్‌ ఇచ్చుకోవడం. ఇదీ బాబు పంథా. 

తుపాను సమయాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో గుర్తించేందుకు భారత ప్రభుత్వం దశాబ్దాల క్రితం భారత వాతావరణ విభాగం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు మాత్రం.. వర్షాలు పడే గ్రామాలను తాము ముందే గుర్తించేశామని చెప్పుకుంటారు. అనుచరగణం కానీ.. సామాన్యులు కానీ మారు మాట్లాడకూడదంతే. మోంథాపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకున్నారు.  గ్రామాలను ముందుగానే గుర్తించినప్పటికీ వర్షాలు ఇంకోచోట కురిశాయని, కాకినాడ వద్ద కాకుండా ఇంకోచోట తుపాను తీరం దాటిందని ఆయనే చెప్పారు. మరి 16 నెలల్లో వారు అభివద్ధి చేసిన టెక్నాలజీ పనిచేసినట్టా? చేయనట్టా? అదృష్టవశాత్తు మోంథా తన దిశను మార్చుకోవడం వల్ల ప్రాణ నష్టం లేకుండా పోయింది. కాని పంటల నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. కోస్తాలోని పలు జిల్లాలలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 

తుపానులు నిలువరించే సైన్స్‌ ఇప్పటివరకూ అభివృద్ధి కాలేదు. కానీ చంద్రబాబు వంటి కొద్దిమంది తాము సముద్రాన్ని నియంత్రించామని, ఎండ వేడి కొన్ని డిగ్రీ సెల్సియస్ తగ్గేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూంటారు. ఇలాంటి వ్యాఖ్యలతో విన్నవారికి మతి పోవడం తప్ప ప్రయోజనం నాస్తి.  అలాగే ఈ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో తెలుసుకుని ఏర్పాటు చేశామని అంటున్నారు. ఒకే. జాగ్రత్తలు తీసుకున్నామని చెబితే ఫర్వాలేదు.కాని కేంద్ర జల కమిషన్ చేపట్టే కార్యక్రమాలను కూడా తన  ప్రభుత్వమే చేస్తున్నట్లు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు వర్షాలు,వరదలు, రిజర్వాయర్ల పరిస్థితులను పర్యవేక్షిస్తూంటుంది. ఆ సమాచారాన్ని రాష్ట్రాలకు అంద చేస్తుంది. ఆ సంగతి ఎవరికి తెలియదన్నట్లుగా తన ఖాతాలో వేసుకుంటే ఎవరికి అప్రతిష్ట? అందుకే ఒక మీడియా 'బాబు గప్పాలకు ఆకాశమే హద్దు" అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ఇచ్చింది. 

మరో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే తుపాను ప్రభావ ప్రాంతాలలో గ్రామ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి.  సిబ్బంది సేవలు అవసరమయ్యాయి.  చంద్రబాబు గతంలో ఈ వ్యవస్థలను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వీటి పేర్లను స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చే యోచన చేస్తోందట. పేరు మార్చితే  జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను జనం మర్చిపోతారా? కరోనా వంటి అతి పెద్ద సంక్షోభాన్ని సైతం జగన్‌ ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను వినియోగించి సమర్ధంగా ఎదుర్కొన్న విషయాన్ని మర్చిపోకూడదు.  వరదలు వంటివి సంభవించినప్పుడు జగన్‌ జిల్లాల అధికారులకు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చి, నిధులు అందుబాటులో ఉంచి సహాయ చర్యలు చేపట్టేవారు. ప్రజలలోకి వెళ్లి సహాయక చర్యల అమలును తెలుసుకునేవారు. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అదేదో తామే తుపానును నిలుపుదల చేశామన్నంతగా బిల్డప్ ఇచ్చుకోవడమే సమస్య. 

చంద్రబాబు, లోకేశ్‌లు కంప్యూటర్ల ముందు కూర్చుని పర్యవేక్షించారంటూ ఊదరగొట్టారు. టీడీపీ మీడియా మరింతగా రెచ్చిపోయి జనానికి ఊపిరి ఆడనంతగా వీర భజన చేసింది. తుపానును ఎదుర్కోవడంలో చంద్రబాబును మించిన సమర్థుడు మరొకరు లేరని, తుపానును సైతం నిలిపివేశారని, తుపానే మోకరిల్లిందని, చంద్రబాబు, లోకేశ్‌లు నిద్రాహారాలు మాని 72 గంటలపాటు పని చేశారని, తన కుటుంబంలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కూడా వెళ్లలేదని మరీ ప్రచారం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల వద్ద మార్కులు కొట్టేయడానికి టీడీపీ డప్పు వాయించిందన్నమాట. వివాహ కార్యక్రమానికి కూడా చంద్రబాబు వెళ్లారు.

అంటే ఎల్లో మీడియా అసత్యం ప్రచారం చేసిందని తేలిపోయింది కదా!  దీనివల్ల మీడియాకు ఏమైనా గిట్టుబాటు అవుతుందేమో కాని, చంద్రబాబు, లోకేశ్‌లకు మాత్రం నష్టమే. చంద్రబాబుకు సాధ్యపడలేదు కాని, వీలైతే తుపానును వెనక్కి పంపించడానికి కూడా వెనుకాడరని మరో టిడిపి మీడియా చెప్పడం విని అంతా నివ్వెరపోయారు. చంద్రబాబే తన గురించి పొగుడుకుంటున్నప్పుడు టీడీపీ నేతలు, మంత్రులు వెనుకబడతారా? ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంలో సేఫ్‌ అని ఒక మంత్రి అంటే, చంద్రబాబు, లోకేశ్‌, పవన్ కళ్యాణ్‌లు తుపానును తెలంగాణ వైపు మళ్లించేశారని మరో మంత్రి వ్యాఖ్యానించారట. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటివల్ల చంద్రబాబు వంటి సీనియర్ నేత నవ్వుల పాలవుతారు తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. 

మోంథా తుపాను వల్ల ఆంధ్ర రైతులకు జరిగిన నష్టం పూరించలేనంత. అసలే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఈ తుపాను పులిమీద పుట్రలా మారింది. ప్రభుత్వం రెండు, మూడు లక్షల ఎకరాలలో పంట నష్టం అని  చెబుతున్నా అసలు నష్టం ఇంకా చాలా ఎక్కువనే అంచనాలున్నాయి. నష్టం 15 లక్షల ఎకరాల మేర ఉండవచ్చునని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఇలాంటి ఘట్టాలలో సాధారణంగా చంద్రబాబు భారీ గణాంకాలు చెబుతుంటారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు తొలుత రూ.60 కోట్ల నష్టం అన్నారు. తరువాత దానిని రూ.20 వేల కోట్లకు తగ్గించారు. కేంద్రానికి నివేదిక పంపినప్పుడు రూ.13 వేల కోట్లుగా తెలిపారు. ప్రధాని మోడీ తొలుత రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించి, అంతిమంగా 600 కోట్లు ఇచ్చారు.

ఈసారి ఎందువల్లో నష్టాన్ని ప్రాథమికంగా రూ. 5400 కోట్లకే పరిమితం చేశారు. అందులోను వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని తగ్గించి చూపారా అన్న సందేహం ఉంది. రైతులకు బీమా సదుపాయం అమలు చేయకపోవడం, తదితర కారణాల వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏమైనా ఇలా చేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తుపాను నష్ట పరిహాం తీసుకుంటే ధాన్యం కొనుగోళ్లకు బాధ్యత లేదని ప్రభుత్వం చెబుతోందట. ఇది రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు, లోకేశ్‌లు తమకు తాము ఇచ్చుకునే ఎలివేషన్స్‌కు తోడు ఎల్లో మీడియా వీర భజన ఏపీ ప్రజలకు విసుగు తెప్పిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్న సూక్తికి బదులు అతి ప్రచారమే మిన్న  అని చంద్రబాబు సర్కార్ భావిస్తోందా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement