- నన్నెవరూ ఏం చేయలేరని చిన్ని ధీమా
- లోకేష్ అండ తనకే అంటున్న ఎంపీ
కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రేపిన మంటలు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుకు తాకాయి. అయితే దాన్ని ఎలా సరిదిద్దాలి.. ఏమి చేయాలన్నదానిమీద చంద్రబాబు.. లోకేష్ మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) , తిరువూరు (ఎస్సి) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరూ తొలిసారి గెలిచినవారే. అయితే తననుంచి రూ. 5 కోట్లు తీసుకుని టిక్కెట్ ఇచ్చారు అంటూ కొలికపూడి అటు ఎంపీ మీద ఆరోపణలు చేసారు. ఆంతే కాకుండా తాము డబ్బులిచ్చి తిరువూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కొన్నామని, దీంతోబాటు చిన్ని అనుచరులు చేయని దందా లేదని.. ఇసుక.. లిక్కర్.. గంజాయి వంటి అన్నిరకాల అనైతిక పనులకు సైతం వాళ్ళే కేంద్రకం అంటూ దుమారం రేపారు.
అయితే పిల్లల ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న నీకు ఐదు కోట్లు ఎక్కడివి.. నిన్ను ఎవరు వెనకనుంచి నడిపించారు.. నువ్వు ఎవరికీ బినామీవి అంటూ ఇటు చిన్ని ఆఫీసు నుంచి ఎదురుదాడి మొదలైంది. మొత్తానికి టీడీపీ నాయకులూ ఇద్దరూ వీధినపడి కొట్టుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడ్చారు అని చంద్రబాబు సీరియస్ అయ్యారు.. ఇద్దరిమీదా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనవసరంగా వారికి టిక్కెట్లు ఇచ్చాను అంటూ చిరుకోపం ప్రదర్శించారు.. అయితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా సస్పెన్స్.. అయితే వీరిద్దరూ ఈనెల నాలుగున క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
కొలికపూడి మీద చర్యలుంటాయా ?
గతంలో హద్దు మీరి ప్రవర్తించి ఏకంగా లైంగికంగా మహిళా కార్యకర్తలను వేధించిన ఆరోపణల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయన తనను వేధించారని, వ్యక్తిగతంగా కలవాలని చెప్పేవారని.. అయన తీరుతో తాను విసిగిపోయానని పార్టీ మహిళా కార్యకర్త ఒకరు చేసిన ఆరోపణలు.. దానికి సంబంధించిన ఆడియో ఆధారాలు కలిపి బయటకు రావడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసింది. నకిలీ మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలమీద తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డిని, మరో నేత సురేంద్ర నాయుడుని సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయితే ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ లైన్ దాటి అపరిమిత స్వేచ్ఛను తీసుకుని ఏకంగా ఎంపీ మీద అవినీతి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ ను ఏం చేస్తారన్న ఉత్కంఠ పార్టీ క్యాడర్లో నెలకొంది.
లోకేష్ జపంతో గట్టెక్కనున్న చిన్ని
ఇదిలా ఉండగా చిన్ని మాత్రం తనకు ఏమీ కాదని దిలాసాగా ఉన్నారు. తనకు లోకేష్ మద్దతు.. ఆశీస్సులు ఉన్నాయని.. అయన బలంతోనే తాను టిక్కెట్ తెచ్చుకున్నానని చెబుతున్నారు. అలాంటి తనను ఈ నిబంధనలు, క్రమశిక్షణ సంఘం ఏమీ చేయలేదని అంటున్నారు. తానూ అధిష్టానానికి అతీతుణ్ణి అనే కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. దీనికి అనుగుణంగా అయన ప్రస్తుతం జరిగే అన్ని సభలు.. సమావేశాల్లోనూ లోకేష్ ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా దానికి లోకేష్ కమిట్మెంట్ .. అయన కృషి.. చిత్తశుద్ధి ఇవే కారణం అంటూ భజన చేస్తూ ఉన్నారు. లోకేష్ కనుసన్నల్లో ఉంటె చాలు తనకు పార్టీలో ఎలాంటి అడ్డంకులు ఉండవని అయన ధీమాగా ఉంటున్నారు. లోకేష్ నామస్మరణ తనకు శ్రీరామా రక్ష అని అయన నమ్ముతున్నారు. దీంతో అయన ఆ మంత్రోచ్చారణద్వారా ఈ వివాదం నుంచి గట్టెగ్గగలలని నమ్ముతున్నారు. ఇక దళితుడైన కొలికపూడి మాత్రం ఏం చేయాలో పాలుపోక డిఫెన్స్ లో పడ్డారు.. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి రేపు మంగళవారం పార్టీ క్రమశిక్షణ సంఘం వద్ద వారు తమ వాదనలు.. వివరణలు ఇవ్వనున్నారు.
. సిమ్మాదిరప్పన్న


