
ఆన్‌లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్: జిల్లాలో ఆన్‌లైన్ లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ అంశాలపై ఎల్‌డీఎం, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. డీఆర్‌డీఏ ద్వారా పొందుతున్న సామాజిక పింఛన్లు, డ్వామా ద్వారా ఉపాధి హామీ పథకం నుంచి కూలీలు పొందుతున్న నగదు.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే డ్వామాలో 2లక్షల 60వేల ఖాతాలను కూడా అనుసంధానం చేయాల్సి ఉందన్నారు.
ఉపాధి హామీ పథకం కింద వేతనం పొందుతున్న వారి బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్‌తో లింక్ చేయాలని, పోస్టాఫీసుల్లోని ఖాతాలను బ్యాంకు ఖాతాలుగా మార్చాలని సూచించారు. జిల్లాలో జన్‌ధన్ యోజన పథకం కింద తెరచిన ఖాతాలు ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి, ఎన్ని ఉపయోగంలో లేవో గుర్తించి వివరాలను ఎల్‌డీఎంకు అందించాలని తెలిపారు. ఎల్‌డీఎం ద్వారా బ్యాంకు కంట్రోలింగ్ అధికారులకు పంపి యాక్టివేట్ చేయించాలన్నారు. బ్యాంకుల వద్ద ఇంకా రూపే కార్డులు అందించకపోతే వివరాలు తెలుసుకొని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాల నంబర్లు, ఆధార్ నంబర్లతో పాటు బ్యాంకు బాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా తీసుకోవాలని సూచించారు.
యూప్‌లపై అవగాహన పెంచాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ మొబైల్ బ్యాంకిం సేవల వినియోగం, మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానాలపై ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహారావు, డీఆర్‌డీఏ పీడీ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఎన్‌ఐసీ డీఐఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ యాప్ డౌన్‌లోడ్ వినియోగం గురించి ఆంధ్రాబ్యాంకు ఐటీ ఆఫీసర్ శేఖర్, ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ నళినికాంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా 50వేల రూపాయల వరకు లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని వివరించారు. సాధారణ మొబైల్ సెల్ ద్వారా రూ. 5వేల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చని తెలిపారు. స్టేట్ బ్యాంకు బడ్డీ అనే యాప్‌పై డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని వివరించారు.