ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం..
►మూడు రోజులుగా యువతి దీక్ష
►రేఖవానిపాలెంలో నిరసన
తగరపువలస (భీమిలి): తాను ప్రేమించిన యువకునితో పెళ్లి జరిపించాలని కోరుతూ భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ గ్రామంలో మూడురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాజ్యలక్ష్మి ఉదంతం గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన నూకవరపు రాజ్యలక్ష్మికి కాకినాడకు చెందిన రాంజీ అనే యువకునితో ఏడాది క్రితం భీమిలిలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సుముఖంగా లేకపోవడంతో రాజ్యలక్ష్మి 20 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో భీమిలి పోలీసులు ఈ నెల 3వ తేదీన రాంజీపై కేసు నమోదు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాంజీ రేఖవానిపాలెంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. విషయం తెలిసిన రాజ్యలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఆ యువకుడు గానీ, అతని బంధువులు గానీ స్పందించలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి ఆమె గ్రామంలోనే నిరసన చేపట్టింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో విలేకరులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మికి స్థానికులు ఆశ్రయం కల్పించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.