Protest strike
-
నేడు పుల్లెంలలో షర్మిల దీక్ష
చండూరు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు విరమిస్తారని సన్నాహక కమిటీ కన్వీనర్ ఇరుగు సునీల్ తెలిపారు. -
20న మండలాల్లో బీజేపీ దీక్షలు
-
20న మండలాల్లో బీజేపీ దీక్షలు
► ముస్లిం రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న ముస్లిం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న అన్ని మండల కేం ద్రాల్లో నిరసన దీక్షను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమా న్ని విస్తరించడంలో భాగంగా వివిధ రూపా ల్లో ఆందోళనలు, నిరసనలను కొనసాగించా లని సోమవారం జరిగిన రాష్ట్ర పార్టీ పదాధి కారుల సమావేశంలో నిర్ణయించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచడం వల్ల రాష్ట్రంలోని బీసీల రిజర్వేషన్లలో కోత పడు తుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఇప్పటికే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను అమలు చేయడంవల్ల జీహెచ్ ఎంసీలో బీసీలకు జరిగిన నష్టాన్ని తగిన సమాచారంతో ప్రజలకు వెల్లడించాలని నిర్ణ యించింది. దీనివల్ల బీసీలకు మరింత నష్టం జరుగుతుందనే వాదనను వినిపించేందుకు కార్యాచరణ రూపొందించనుంది. మండల, జిల్లాస్థాయిల్లో నిర్వహించే నిరసనలను పర్య వేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది నాయకులను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది. ముస్లిం బిల్లు నేపథ్యంలో పార్టీ కార్య కర్తలు, నాయకులు 11 వేల మందిని అరెస్ట్ చేసి, కొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంతోపాటు రిమాండ్‌కు పంపడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపైనా ఆందోళనలను నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నాయకులు పేరాల శేఖర్ రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ల ముట్టడి.. ముఖ్య నేతల అరెస్ట్ ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లను పెంపునకు నిరస నగా సోమవారం 31జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బీజేపీ నిరసనలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలతోపాటు దాదాపు 6 వేల మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. రంగా రెడ్డిలో కె.లక్ష్మణ్, హైదరాబాద్‌లో మురళీధర్ రావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సంగా రెడ్డిలో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే రాజాసింగ్, నల్లగొండలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మేడ్చెల్‌లో ఎమ్మె ల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మహబూబ్న గర్‌లో నాగం జనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం..
►మూడు రోజులుగా యువతి దీక్ష ►రేఖవానిపాలెంలో నిరసన తగరపువలస (భీమిలి): తాను ప్రేమించిన యువకునితో పెళ్లి జరిపించాలని కోరుతూ భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ గ్రామంలో మూడురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాజ్యలక్ష్మి ఉదంతం గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన నూకవరపు రాజ్యలక్ష్మికి కాకినాడకు చెందిన రాంజీ అనే యువకునితో ఏడాది క్రితం భీమిలిలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సుముఖంగా లేకపోవడంతో రాజ్యలక్ష్మి 20 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో భీమిలి పోలీసులు ఈ నెల 3వ తేదీన రాంజీపై కేసు నమోదు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాంజీ రేఖవానిపాలెంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. విషయం తెలిసిన రాజ్యలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఆ యువకుడు గానీ, అతని బంధువులు గానీ స్పందించలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి ఆమె గ్రామంలోనే నిరసన చేపట్టింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో విలేకరులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మికి స్థానికులు ఆశ్రయం కల్పించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. -
ఇది ప్రభుత్వ వైఫల్యమే
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు వస్త్ర పరిశ్రమల ఆందోళనపై సుమోటాగా స్వీకరణ 23న వివరణ ఇవ్వండి రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం బెంగళూరు : ప్రావిడెంట్ ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో బెంగళూరులోవస్త్రపరిశ్రమ కార్మికులు జరిపిన నిరసన దీక్ష హింసాత్మకంగా మారడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర హోంశాఖ నిఘా వర్గాల నిర్లక్ష్యరాహిత్యమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడింది. న్యాయమూర్తి ఏ.ఎన్ వేణుగోపాల్ గౌడ ఈ కేసు విషయమై మాట్లాడుతూ... నిరసన దీక్షలు శాంతిభద్రతల సమస్యగా మారినప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విషయంపై మంగళూరు, మైసూరు ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోలేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బెంగళూరు ఘటనకు సంబంధించి ఈనెల 23న డీజీపీ ఓంప్రకాశ్ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
మరచిపోలేని పీడకల
♦ రుణమంటే రియాజ్, యాసీన్‌లకు భయం ♦ దీనిపై ఇక్బాల్‌తో పలు సందర్భాల్లో ఘర్షణలు ♦ ‘దిల్సుఖ్నగర్ కేసు’లో ఇద్దరూ నిందితులే సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక భత్కల్‌లోని మదీనాకాలనీలో పుట్టా రు.. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించారు... పదుల సంఖ్యలో ఉగ్రవాదబాట పట్టించారు... బాంబు పేలుళ్ల ద్వారా వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు... ఇలాంటి కరుడుగట్టిన చరిత్ర ఉన్న ‘భత్కల్ ద్వయం’ రియాజ్, యాసీన్‌లకు రుణం అంటే మాత్రం హడల్. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌లలో జరిగిన మారణహోమం కేసులో రియాజ్ ప్రధాన నిందితుడిగా, యాసీన్ ఐదో నిందితుడిగా ఉన్నాడు. పేలుళ్లు జరిగి మూడేళ్లు పూర్తై నేపథ్యంలో నిఘా, పోలీసు వర్గాల విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ‘లోన్ టై’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఫోన్’ అంటే పొమ్మన్నాడు... అన్నదమ్ములైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ముంబైలోని కుర్లా ప్రాంతానికి వలస వెళ్లారు. సిమి ద్వారా ముష్కరబాట పట్టి, 2002 నుంచి దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌లో (ఐఎం) కీలకపాత్ర పోషించారు. అప్పటికే రియాజ్‌పై ముంబైలో కొన్ని కేసులు నమోదు కావడంతో పోలీసు నిఘా పెరిగింది. దీంతో అనుచరులను కలుసుకోవడం కష్టసాధ్యంగా మారడంతో ఇందుకు పరిష్కారంగా ఇక్బాల్ ఓ పథకం వేశాడు. కుర్లా ప్రాంతంలో టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేద్దామని... కస్టమర్ల ముసుగులో అనుచరులు వచ్చినా పోలీసులు అనుమానించరని రియాజ్‌తో చెప్పాడు. ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రియాజ్... బూత్ ఏర్పాటుకు అవసరమైన డబ్బు ఎలా? అన్న సందేహాన్ని బయటపెట్టాడు. ఇక్బాల్ రుణం తీసుకుందామనడంతోనే ససేమిరా అంటూ ప్రతిపాదనను విరమింపజేశాడు. తనకు రుణం అంటేనే భయం అంటూ ఏ ‘అవసరాలకూ’ లోన్లు తీసుకునే ప్రసక్తేలేదంటూ కరాఖండీగా చెప్పేశాడు. ఇది 2003లో చోటు చేసుకున్న పరిణామం. ‘వేట’ ఉన్నా వాహనం ఎక్కనన్నారు... అప్పటికే అనేక విధ్వంసాలు సృష్టించిన భత్కల్ ద్వయానికి 2007లో యాసీన్ భత్కల్ పరిచయమయ్యాడు. అప్పటికే గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు మహారాష్ట్రలోనూ విధ్వంసాలు సృష్టించడంతో వీరికోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ ముమ్మరంగా గాలిస్తున్న సమయంలోనే భవిష్యత్తు కార్యాచరణ కోసం ‘భత్కల్ త్రయం’ ముంబైలో కలుసుకుంది. అక్కడి రైల్వేస్టేషన్లో దిగిన రియాజ్, యాసీన్లను తీసుకువెళ్లేందుకు బైక్‌పై వచ్చినఇక్బాల్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు త్వరగా వాహనం ఎక్కాలంటూ వారిని కోరారు. అయితే వాహనం రుణంపై కొన్నదని తెలుసుకున్న రియాజ్, యాసీన్ ససేమిరా ఎక్కమన్నారు. తమకు ఓ సెంటిమెంట్ ఉందని ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవడం, రుణాలకు సంబంధించిన వస్తువుల్ని వాడటం చేయమంటూ స్పష్టం చేసిన వారు ట్యాక్సీలోనే ‘గమ్య’ స్థానానికి చేరారు. ఐఎం కార్యకలాపాలు విస్తరించడానికి బెదిరింపులు, దోపిడీలతో పాటు అక్రమ ఆయుధాల వ్యాపారం చేద్దామని, లోన్ల జోలికి మాత్రం పోవద్దంటూ ఇక్బాల్‌కు చెప్పారు. ప్రస్తుతం ఎక్కడున్నారు..! ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్కౌంటర్... దీనికి కొనసాగింపుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన అరెస్టులతో 2008లో ఐఎం మాడ్యుల్ బ్రేక్ అయింది. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్, ఇక్బాల్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్నారు. ప్రస్తుతం కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్‌కాలనీ ఫేజ్-4లో ఉంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2009 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాసీన్ భత్కల్ భారత్, నేపాలలో తలదాచుకున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాక్ నుంచి రియాజ్ కుట్ర చేయగా... మంగుళూరు నుంచి యాసీన్ అమలు చేశాడు. 2013 ఆగస్టులో బీహార్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన యాసీన్ ప్రస్తుతం మిగిలిన నిందితులతో పాటు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం కీలక విచారణ దశలో ఉన్న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు కోసం జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఆక్టోపస్ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. నేడు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం నిరసన దీక్ష చైతన్యపురి: దిల్సుఖ్నగర్, గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితులు, క్షతగాత్రుల్లో ఆర్థిక సహాయం అందక నిస్సహాయులైన వారికోసం ఆదివారం దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్‌లో దుర్ఘటన జరిగిన స్థలంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం కన్వీనర్ దోర్నాల జయప్రకాష్, అధ్యక్షుడు చందర్‌నాయక్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రహీం తెలిపారు. ఈ సందర్భంగా పేలుళ్లలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు. మరచిపోలేని పీడకల జంట బాంబు పేలుళ్లకు నేటికి మూడేళ్లు... మలక్‌పేట: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ కోణార్క్ ధియేటర్ సమీపంలోని ఏవన్ మిర్చి సెంటర్, 107 నంబర్ బస్టాప్‌లలో జరిగిన పేలుళ్లను పరిసర ప్రాంతవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో 18 మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 107 నంబర్ బస్టాప్‌లో 45 మంది గాయాల పాలుకాగా, 5గురు వ్యక్తులు మృతి చెందారు. మాంసం ముద్దలు, మృతదేహాలు, తెగిపడిన శరీరభాగాలతో నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటే నేటికీ భయం వేస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. మరువలేకున్నాం మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మిర్చిసెంటర్లో పని చేస్తున్న నలుగురు వ్యక్తులం గాయపడ్డాం. భగవంతుని దయ వల్ల బతికి బయటపడ్డాం. పేలుడు ధాటికి చెవులు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ సరిగా వినిపించడం లేదు. మనుషుల ప్రాణాలను తీస్తున్న ఉగ్రవాదులపై పాలకులు కఠినంగా వ్యహరించాలి. - ఆశంగారి బక్కారెడ్డి, ఏవన్ మిర్చి సెంటర్, దిల్సుఖ్నగర్ ఉక్కు పాదం మోపాలి హోటల్‌కు అవసరమైన సామాన్లు తీసుకుని వస్తుండగా దిల్సుఖ్నగర్ 107నంబర్ బస్టాప్ వద్ద జరిగిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాను. సర్కార్ అందించిన రూ. 50 వేలు సరిపోకపోవడంతో మరో రూ.30 వేలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి. -మహ్మద్ అజ్మదుల్లాఖాన్, రోజ్ కేఫ్ నిర్వాహకుడు,మూసారంబాగ్ ఎటువంటి సహాయం అందలేదు దిల్సుఖ్నగర్ బాంబు దాడి జరిగి మూడేళ్లు గడుస్తున్నా నాకు ఎటువంటి సహాయం అందలేదు. రాజీవ్‌చౌక్‌లోని మిర్చి సెంటర్ ముందే బాంబు పేలడంతో రు.5లక్షలకు పైగా నష్ట పోయా. నా సోదరుడు గోపాల్రెడికి కుడి చేతి చిటికెన వేలు పూర్తిగా పోగా, రు.50 వేలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం నేను మిర్చి సెంటర్లో పాన్‌షాప్, మరో షాప్ తీసుకుని మిర్చి సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఆర్ధిక సహాయం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నర్సింహన్, హోంమంత్రి, కలెక్టర్లను కలిసినా పట్టించుకోలేదు. -దిల్సుఖ్నగర్ ఎ-1 మిర్చి సెంటర్ నిర్వహకుడు పాండురెడ్డి -
5, 6 తేదీల్లో జగన్ నిరశన
ఏడాది బాబు పాలన వైఫల్యంపై పోరు ⇒ గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష ⇒ వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి, నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలపు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు రాష్ట్ర విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వచ్చేనెల 5, 6 తేదీల్లో నిరశన దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రైతు విభాగపు అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డిలు ఆదివారం హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వం విజయోత్సవ యాత్రలు జరపాలన్న సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. ఏడాది పాలనలో వైఫల్యాల జాబితా తప్పితే విజయాలేవీ కనబడడం లేదు. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు జరిపిన దాఖలాలూ లేవు. వాళ్లు విజయోత్సవ యాత్రగా కాకుండా వైఫల్యాల యాత్ర అని చెప్పకుంటే సమంజసంగా ఉండేది. పాలనలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజలకు వివరణ ఇచ్చుకుంటే ఇంకా హుందాగా ఉంటుంది. విజయోత్సవ యాత్రలని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం సరికాదు. అన్నీ వైఫల్యాలే ఉన్నప్పుడు.. విజయోత్సవ యాత్రలు జరుపుకోడానికి వారికి నైతిక అర్హత ఎక్కడుంది?. దీనిని ప్రశ్నించడానికే జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు’ అని వివరించారు. పలువురు పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే విజయవాడ- గుంటూరు ప్రాంతాల మధ్య దీక్ష చేపట్టాలని జగన్ నిర్ణయించారని, దీక్ష చేపట్టే ప్రాంతాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే మాఫీ ఎక్కడ జరిగినట్టు? ‘‘రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం అంటున్నారు. రుణమాఫీ అందని వారు ఫిర్యాదు చేసుకోమంటే కుప్పలు కుప్పలుగా బస్తాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు విడతల్లో రైతులకు ఇచ్చింది రూ. 7 వేల కోట్లు కూడా లేదు. రూ.23 వేల కోట్లు రుణమాఫీ చేశామంటున్నారు. ఎందుకు మభ్య పెడుతున్నారో అర్థం కావడంలేదు. రుణమాఫీ చేస్తున్న కొద్ది మందికీ ఏటా 20 శాతం కిస్తీల రూపేణా మీరు ఐదేళ్ల పాటు ఇస్తుంటే, బ్యాంకులు మాత్రం ఏటా 14 శాతం చొప్పున చక్రవడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉంది. రుణమాఫీ అంటే రుణం పూర్తిగా మాఫీ కావడమన్నది ఈ రోజున ఎక్కడ జరిగింది?. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడేమో ఒక్కొక్క మహిళ పేరున బ్యాంకులో రూ. 3 వేలు వేస్తామంటున్నారు. ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి అంశంలోనూ వైఫల్యం చెందిన బాబు సర్కారుకి విజయోత్సవాలు జరుపుకొనే అర్హత లేదు. కృష్ణానది పైభాగంలో రికార్డుస్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం, సాగర్లు నిండినా 90 శాతం మాత్రమే వరి పంటను సాగులోకి తేగలిగారు. వేరుశనగ సాగు 35 శాతం, పప్పుధాన్యాల సాగు 33 శాతం తగ్గిపోయిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. స్వామినాథన్ కమిటీ సిపార్సులను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు కనీస మద్దతు ధరకు కూడా రైతుల నుంచి పంట కొనే పరిస్థితి కల్పించడం లేదు. మద్దతు ధర పెంచాలని కేంద్రంపై వత్తిడి తేలేకపోయారు. కనీసం కేంద్రానికి లేఖనైనా ఎందుకు రాయలేదు?. సాగునీటి రంగంలో.. హంద్రీనీవా పూర్తి చేయడానికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉంటే రూ. 200 కోట్లు బడ్జెట్లో పెట్టి దానిని ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.1,550 కోట్లు కావాల్సి ఉంటే రూ.153 కోట్లు బడ్జెట్లో పెట్టి దానినీ ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. ఇవన్నీ మభ్యపెట్టే మాటలు కాదా?. వీటిని ప్రశ్నించేందుకే.. జగన్ దీక్షకు దిగుతున్నారు.’’ అని ఉమ్మారెడ్డి, నాగిరెడ్డిలు వివరించారు.