హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
వస్త్ర పరిశ్రమల ఆందోళనపై సుమోటాగా స్వీకరణ
23న వివరణ ఇవ్వండి
రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం
బెంగళూరు : ప్రావిడెంట్ ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో బెంగళూరులోవస్త్రపరిశ్రమ కార్మికులు జరిపిన నిరసన దీక్ష హింసాత్మకంగా మారడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర హోంశాఖ నిఘా వర్గాల నిర్లక్ష్యరాహిత్యమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడింది.
న్యాయమూర్తి ఏ.ఎన్ వేణుగోపాల్ గౌడ ఈ కేసు విషయమై మాట్లాడుతూ... నిరసన దీక్షలు శాంతిభద్రతల సమస్యగా మారినప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విషయంపై మంగళూరు, మైసూరు ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోలేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బెంగళూరు ఘటనకు సంబంధించి ఈనెల 23న డీజీపీ ఓంప్రకాశ్ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.