మరచిపోలేని పీడకల | dilsuknagar bomb blasts today 3rd year | Sakshi
Sakshi News home page

మరచిపోలేని పీడకల

Published Sun, Feb 21 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

మరచిపోలేని పీడకల

మరచిపోలేని పీడకల

రుణమంటే రియాజ్, యాసీన్‌లకు భయం
దీనిపై ఇక్బాల్‌తో పలు సందర్భాల్లో ఘర్షణలు
‘దిల్‌సుఖ్‌నగర్ కేసు’లో ఇద్దరూ నిందితులే

 సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక భత్కల్‌లోని మదీనాకాలనీలో పుట్టా రు..  హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించారు... పదుల సంఖ్యలో ఉగ్రవాదబాట పట్టించారు... బాంబు పేలుళ్ల ద్వారా వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు... ఇలాంటి కరుడుగట్టిన చరిత్ర ఉన్న ‘భత్కల్ ద్వయం’ రియాజ్, యాసీన్‌లకు రుణం అంటే మాత్రం హడల్. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌లలో జరిగిన మారణహోమం కేసులో రియాజ్ ప్రధాన నిందితుడిగా, యాసీన్ ఐదో నిందితుడిగా ఉన్నాడు. పేలుళ్లు జరిగి మూడేళ్లు పూర్తై నేపథ్యంలో నిఘా, పోలీసు వర్గాల విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ‘లోన్ టై’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

 ‘ఫోన్’ అంటే పొమ్మన్నాడు...
 అన్నదమ్ములైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ముంబైలోని కుర్లా ప్రాంతానికి వలస వెళ్లారు. సిమి ద్వారా ముష్కరబాట పట్టి, 2002 నుంచి దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌లో (ఐఎం) కీలకపాత్ర పోషించారు. అప్పటికే రియాజ్‌పై ముంబైలో కొన్ని కేసులు నమోదు కావడంతో పోలీసు నిఘా పెరిగింది. దీంతో అనుచరులను కలుసుకోవడం కష్టసాధ్యంగా మారడంతో ఇందుకు పరిష్కారంగా ఇక్బాల్ ఓ పథకం వేశాడు. కుర్లా ప్రాంతంలో టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేద్దామని... కస్టమర్ల ముసుగులో అనుచరులు వచ్చినా పోలీసులు అనుమానించరని రియాజ్‌తో చెప్పాడు.

 ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రియాజ్... బూత్ ఏర్పాటుకు అవసరమైన డబ్బు ఎలా? అన్న సందేహాన్ని బయటపెట్టాడు. ఇక్బాల్ రుణం తీసుకుందామనడంతోనే ససేమిరా అంటూ ప్రతిపాదనను విరమింపజేశాడు. తనకు రుణం అంటేనే భయం అంటూ ఏ ‘అవసరాలకూ’ లోన్లు తీసుకునే ప్రసక్తేలేదంటూ కరాఖండీగా చెప్పేశాడు. ఇది 2003లో చోటు చేసుకున్న పరిణామం.

 ‘వేట’ ఉన్నా వాహనం ఎక్కనన్నారు...
 అప్పటికే అనేక విధ్వంసాలు సృష్టించిన భత్కల్ ద్వయానికి 2007లో యాసీన్ భత్కల్ పరిచయమయ్యాడు. అప్పటికే గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు మహారాష్ట్రలోనూ విధ్వంసాలు సృష్టించడంతో వీరికోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ ముమ్మరంగా గాలిస్తున్న సమయంలోనే భవిష్యత్తు కార్యాచరణ కోసం ‘భత్కల్ త్రయం’ ముంబైలో కలుసుకుంది. అక్కడి రైల్వేస్టేషన్‌లో దిగిన రియాజ్, యాసీన్‌లను తీసుకువెళ్లేందుకు బైక్‌పై వచ్చినఇక్బాల్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు త్వరగా వాహనం ఎక్కాలంటూ వారిని కోరారు. అయితే వాహనం రుణంపై కొన్నదని తెలుసుకున్న రియాజ్, యాసీన్ ససేమిరా ఎక్కమన్నారు. తమకు ఓ సెంటిమెంట్ ఉందని ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవడం, రుణాలకు సంబంధించిన వస్తువుల్ని వాడటం  చేయమంటూ స్పష్టం చేసిన వారు ట్యాక్సీలోనే ‘గమ్య’ స్థానానికి చేరారు. ఐఎం కార్యకలాపాలు విస్తరించడానికి బెదిరింపులు, దోపిడీలతో పాటు అక్రమ ఆయుధాల వ్యాపారం చేద్దామని, లోన్ల జోలికి మాత్రం పోవద్దంటూ ఇక్బాల్‌కు చెప్పారు.

 ప్రస్తుతం ఎక్కడున్నారు..!
 ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్... దీనికి కొనసాగింపుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన అరెస్టులతో 2008లో ఐఎం మాడ్యుల్ బ్రేక్ అయింది. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్, ఇక్బాల్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్నారు. ప్రస్తుతం కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్‌కాలనీ ఫేజ్-4లో ఉంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2009 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాసీన్ భత్కల్ భారత్, నేపాలలో తలదాచుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాక్ నుంచి రియాజ్ కుట్ర చేయగా... మంగుళూరు నుంచి యాసీన్ అమలు చేశాడు. 2013 ఆగస్టులో బీహార్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన యాసీన్ ప్రస్తుతం మిగిలిన నిందితులతో పాటు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం కీలక విచారణ దశలో ఉన్న దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు కోసం జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఆక్టోపస్ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు.
 
 నేడు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం  నిరసన దీక్ష
 చైతన్యపురి: దిల్‌సుఖ్‌నగర్, గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితులు, క్షతగాత్రుల్లో ఆర్థిక సహాయం అందక నిస్సహాయులైన వారికోసం ఆదివారం   దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్‌లో దుర్ఘటన జరిగిన స్థలంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం కన్వీనర్ దోర్నాల జయప్రకాష్, అధ్యక్షుడు చందర్‌నాయక్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రహీం తెలిపారు. ఈ సందర్భంగా పేలుళ్లలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు.
 
 మరచిపోలేని పీడకల జంట బాంబు పేలుళ్లకు నేటికి మూడేళ్లు...
 మలక్‌పేట: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. నిత్యం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ కోణార్క్  ధియేటర్ సమీపంలోని ఏవన్ మిర్చి సెంటర్, 107 నంబర్ బస్టాప్‌లలో జరిగిన పేలుళ్లను పరిసర ప్రాంతవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో 18 మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 107 నంబర్ బస్టాప్‌లో 45 మంది గాయాల పాలుకాగా, 5గురు వ్యక్తులు మృతి చెందారు. మాంసం ముద్దలు, మృతదేహాలు, తెగిపడిన  శరీరభాగాలతో నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటే నేటికీ భయం వేస్తోందని బాధితులు పేర్కొంటున్నారు.  
 
 మరువలేకున్నాం
 మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం.  మిర్చిసెంటర్‌లో పని చేస్తున్న నలుగురు వ్యక్తులం గాయపడ్డాం. భగవంతుని దయ వల్ల బతికి బయటపడ్డాం. పేలుడు ధాటికి చెవులు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ సరిగా వినిపించడం లేదు. మనుషుల ప్రాణాలను తీస్తున్న ఉగ్రవాదులపై పాలకులు కఠినంగా వ్యహరించాలి. - ఆశంగారి బక్కారెడ్డి, ఏవన్ మిర్చి సెంటర్, దిల్‌సుఖ్‌నగర్
 
 ఉక్కు పాదం మోపాలి
 హోటల్‌కు అవసరమైన సామాన్లు తీసుకుని వస్తుండగా దిల్‌సుఖ్‌నగర్ 107నంబర్ బస్టాప్ వద్ద జరిగిన బాంబు పేలుడులో తీవ్రంగా  గాయపడ్డాను. సర్కార్ అందించిన రూ. 50 వేలు సరిపోకపోవడంతో మరో రూ.30 వేలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకున్నారు.  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి. -మహ్మద్ అజ్మదుల్లాఖాన్, రోజ్ కేఫ్ నిర్వాహకుడు,మూసారంబాగ్
 
 ఎటువంటి సహాయం అందలేదు
 దిల్‌సుఖ్‌నగర్ బాంబు దాడి జరిగి మూడేళ్లు గడుస్తున్నా నాకు ఎటువంటి సహాయం అందలేదు. రాజీవ్‌చౌక్‌లోని మిర్చి సెంటర్ ముందే బాంబు పేలడంతో రు.5లక్షలకు పైగా నష్ట పోయా. నా సోదరుడు గోపాల్‌రెడికి కుడి చేతి చిటికెన వేలు పూర్తిగా పోగా, రు.50 వేలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం నేను మిర్చి సెంటర్‌లో పాన్‌షాప్, మరో షాప్ తీసుకుని మిర్చి సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఆర్ధిక సహాయం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నర్సింహన్, హోంమంత్రి, కలెక్టర్‌లను కలిసినా పట్టించుకోలేదు.   -దిల్‌సుఖ్‌నగర్ ఎ-1 మిర్చి సెంటర్ నిర్వహకుడు పాండురెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement