ఆక్వా ఎగుమతితో విదేశీ మారకద్రవ్యం
-
నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ నందకిషోర్
నెల్లూరు రూరల్ :
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో విదేశీమారద ద్రవ్యం వస్తుందని నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ టి.నందకిశోర్ అన్నారు. ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ సంస్థ నెల్లూరు శాటిలైట్ సెంటర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆక్వా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ సౌకర్యంపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తోందన్నారు. రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలంటే ఎంపెడాలో రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, భూమి పాస్‌బుక్, సాగు చేస్తున్న చేప, రొయ్యల రకాలు, తదితర వివరాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రైతుల ఉత్పత్తులను పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని, ఈ సర్టిఫికేట్ ఆధారంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాస్కా ఫీల్డ్‌మేనేజర్ పాపయ్య, పావనమూర్తి, రవీంద్ర, పర్వేజ్, ఆక్వా సొసైటీ అధ్యక్షుడు కుమారి అంకయ్య, ఉడతా వెంకటేశ్వర్లు, బాలయ్య, ఆక్వా రైతులు పాల్గొన్నారు.