
కొంగర కలాన్ లో విదేశీ ఆస్పత్రి
వంద ఎకరాల్లో వెయ్యి పడకల వైద్యశాల
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మరో కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో సకల వసతులున్న వైద్యశాల ఏర్పాటు చేసేందుకు ఇండో -యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. వెయ్యి పడకలతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో స్థలం కేటాయిస్తే రవాణాకు సులభమవుతుందని వారు సీఎంకు వివరించారు.
ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుకు ఔటర్ సమీపంలో మూడు చోట్ల స్థలాలు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం యూకే సంస్థకు సూచించింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో దాదాపు 50 నుంచి 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఇదే విషయాన్ని యూకే బృందానికి వివరించారు.
దీంతో వారు కూడా ఆస్పత్రి ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇంకా ప్రభుత్వంతో ఆ సంస్థ ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ఆస్పత్రి జిల్లాలో ఏర్పాటైతే అందులో మెజార్టీ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించ గా.. అందుకు యూకే సంస్థ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.